కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సక్సేనా సిఫార్సు

నిషిద్ధ ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి రాజకీయ నిధులు స్వీకరించారన్న ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఎఐ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సిఫార్సు చేసినట్లు రాజ్ నివాస్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఆ మేరకు కేంద్ర హోం కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు.

 ఉగ్రవాది దేవేంద్ర పాల్ భుల్లర్‌ను విడుదల చేయడానికి, దేశంలో ఖలిస్థానీ అనుకూల భావాలను ప్రోత్సహించడానికి వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూన్ స్థాపించిన నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు 16 మిలియన్‌ డాలర్లు అందాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆ లేఖలో ఆరోపించారు.

ఢిల్లీలో 1993లో 9 మంది ప్రాణాలు తీసిన ఒక బాంబు పేలుడు కేసులో దోషిగా తేనలి భుల్ల్లార్ అమృత్‌సర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. 2001 ఆగస్టు 25న ప్రత్యేక టాడా కోర్టు భుల్ల్లార్‌కు మరణ శిక్ష విధించగా సుప్రీంకోర్టు దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.  తనకు ఫిర్యాదు చేసి వ్యక్తి అందచేసిన ఎలెక్ట్రానిక్ సాక్ష్యాలను ఫోరెన్సిక్ పరీక్షలతోసహా దర్యాప్తు అవసరం ఉందని తన లేఖలో సక్సేనా పేర్కొన్నట్లు వర్గాలు తెలిపాయి.

ఒక నిషిద్ధ ఉగ్రవాద సంస్థ నుంచి రాజకీయ నిధులు స్వీకరించినట్లు ఒక ముఖ్యమంత్రిపై ఫిర్యాదు అందిందని ఆయన తన లేఖలో తెలిపారు. దీని గురించి పన్నూన్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను ఆ లేఖకు జత చేశారు. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మరోవైపు ఇప్పటికే మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, తీహార్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

నిషేధిత ఖలిస్థాన్ గ్రూప్‌లకు, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య క్విడ్ ప్రోకో జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.  అందులోభాగంగా 2014 నుంచి 2022 మధ్య నిషేధిత ఖలిస్థాన్ గ్రూప్‌ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 16 మిలియన్ల యూఎస్ డాలర్లు అందినట్లు ఓ ఆరోపణ. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో.. ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయాన్ని మంగళవారం సుప్రీంకోరు పరిశీలించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా..తాజా పరిణామంపై ఆప్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మరో కుట్రకు తెరతీశారని ఆరోపించారు.