చంద్రబాబు, లోకేష్ లపై చెరో 23 కేసులు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై చెరో 23 కేసులు నమోదై ఉన్నాయి.. నామినేషన్ల దాఖలు కోసం అడిగినప్పుడు పోలీస్‌ శాఖ ఈ వివరాలను వారికి అందజేసింది. వీటిని టీడీపీ న్యాయ విభాగం పరిశీలిస్తోంది.. చంద్రబాబుపై సీఐడీ ఎనిమిది కేసులు పెట్టింది. 
 
వీటితో పాటుగా జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయంలో ఇతరత్రా పదిహేను కేసులు నమోదు చేశారు. లోకేష్‌పై సీఐడీ కేసు ఒకటి ఉంది. మిగిలిన కేసులు యువగళం పాదయాత్ర సమయంలో నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎక్కువ శాతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పెట్టారు.
 
గతంలో ఇద్దరు నేతలపై పెద్దగా కేసులు లేవు. మరికొద్దిరోజుల్లో చంద్రబాబు, లోకేష్‌లు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రంలో కేసుల వివరాలను పొందుపరిచేందుకు చంద్రబాబు, నారా లోకేష్ కేసుల వివరాలను తెలుగుదేశం పార్టీ సేకరించింది. ఇదివరకు తమపై ఒక్క కేసు లేదని, తన రాజకీయ జీవితం తెరచిన పుస్తకం అని చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
 
చంద్రబాబు, లోకేష్‌లతో పాటుగా మరికొందరు టీడీపీ నేతలు తమపై ఉన్న కేసుల వివరాలు కావాలని డీజీపీకి లేఖ రాశారు. అయితే వివరాలు ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కేసుల వివరాలను చంద్రబాబు, ఇతరులకు మెయిల్‌లో పంపామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
 చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్ లపై కేసుల వివరాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
 
మార్చ్ 1వ తేదిన డీజీపీకి లేఖ రాసినప్పటికీ నేటి వరకు వివరాలు ఇవ్వలేదని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది ధమ్మాలపాటి శ్రీనివాస్ పిటీషన్ దాఖలు చేశారు. గత విచారణలో కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు పేర్కొనకపోతే నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉందని కోర్టుకు పిటిషనర్ల తరపు లాయర్లు వివరించారు. 
 
ఈ సమాచారం మొత్తాన్ని ఇవ్వాలంటే ఎలా సాధ్యమవుతుందని, డీజీపీ కార్యాలయానికి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు కూడా.
గతంలో రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసుల వివరాలను డీజీపీనే ఇచ్చారన్న విషయాన్ని పిటిషనర్‌ల తరపు న్యాయవాది గుర్తుచేశారు.  కేసుల వివరాలు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏంటంటూ జడ్జి ప్రశ్నిస్తూ.. డీజీపీని అడిగి వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. మంగళవారానికి విచారణ వాయిదా పడటంతో ఈరోజు మరోసారి హైకోర్టులో విచారణకు రాగా.. కేసుల వివరాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.