దేశంలోనే ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానని మాజీ కేంద్రమంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోందని, ఈ పాలన పోయి ఇక్కడ రామరాజ్యం స్థాపన దిశగా నియోజకవర్గాన్ని రూపొందిస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు.
నగరంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో సుజనా చౌదరి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడకు రాజకీయ రాజధానిగా పేరుందని, అలాగే పశ్చిమ నియోజకవర్గం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉందని తెలిపారు. అయితే ఇక్కడ వాణిజ్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని, ఎకానమీ పెంపు ద్వారానే ఇది సాధ్యమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అమ్మవారి చలవతో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని సుజనా చెప్పారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు డబుల్ ఇంజన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మైనారిటీలకు హజ్ హౌస్ నిర్మాణం, క్రైస్తవులకు అవసరమైన చర్చిల మరమ్మతులకు సహకారం అందజేస్తానని సుజనా చౌదరి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, జనసేన నాయకురాలు రజని, అమరావతి బహుజన సేవా సమితి నేత బాలకోటయ్య, తదితరులు పాల్గొన్నారు.
More Stories
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్
ఏపీ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య