గీత దాటితే ఏపీ ప్రభుత్వ సలహాదారులపై వేటు

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పలువురు ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాజకీయ ప్రచారాల్లో పాల్గొనడం, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడంపై పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో ఈసీ సలహాదారులు గీత దాటితే వేటు తప్పదంటూ హెచ్చరించింది.

కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులైన సలహాదారులు, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని భారత ఎన్నికల కమిషన్ మంగళవారం ఆదేశాలు జారీచేసింది.

ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచార రంగంలోకి ప్రవేశిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని కమిషన్ గుర్తించింది. సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి సహా పలువురు సలహాదారులు కోడ్ వచ్చిన తర్వాత విపక్షాలను విమర్శిస్తూ ప్రచారం చేశారు. 

సలహాదారుల తీరుపై సమీక్ష తర్వాత ప్రభుత్వ మంత్రులకు వర్తించే నియామవళి సలహాదారులకు కూడా నియమావళి వర్తిస్తుందని ఈసీఐ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘిచినా తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి, మోడల్ కోడ్‌ అమలు, సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలను తీసుకుంటామని ఈసీఐ స్పష్టం చేసింది.

ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు అందాయని అందులో పేర్కొంది.  నిర్దేశిత పనికి బదులు రాజకీయ ప్రచారంలోకి వస్తున్నారని.. ప్రతిపక్షాలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను నిర్వహిస్తున్నారని గుర్తించినట్లు ఈసీ వివరించింది. 
 
మంత్రుల మాదిరే వీరికి కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.  ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎం కె మీనా ఈ విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్ కు నివేదించారు.