అమరావతి రాజధాని నమూనా గ్యాలరీ ధ్వంసం

అమరావతిలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజధాని నిర్మాణం బృహత్తర ప్రణాళిక, రాజధాని శంకుస్థాపన ప్రదేశంలోని అమరావతి నగర నమూనా గ్యాలరీని సైతం ఆనవాళ్లు లేకుండా దుండగులు ధ్వంసం చేశారు. ఆ ప్రాంగణంలోనే మద్యం తాగి సీసాలు పడేశారు. 
 
అమరావతి అని పేరు ఉన్న బోర్డును కూడా పగలగొట్టారు. రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించడానికి బుధవారం ఎన్డీయే కూటమి గుంటూరు లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఉద్దండరాయునిపాలెం వెళ్లినప్పుడు రాజధాని రైతులు ఈ విషయాన్ని గుర్తించారు.  2015 అక్టోబర్ 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇక్కడ రాజధానికి శంకుస్థాపన జరిగింది.
ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి గత ప్రభుత్వం ఇక్కడ త్రీడీ నమూనాలను ఏర్పాటు చేసింది. ప్రజలు ఈ మ్యూజియాన్ని సందర్శించి భవిష్యత్తులో నగరం ఎలా ఉంటుందో అంచనాకు వచ్చేవారు. అప్పటి ప్రభుత్వం దీని నిర్వహణకు, భద్రతకు సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అమరావతి నమూనాలను కూడా సందర్శకులకు అందుబాటులో లేవు.. గ్యాలరీని మూసేసింది.
భద్రతా సిబ్బందిని తొలగించడంతో, సీఆర్‌డీఏ పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగాయి. దుండగులు భవనం తాళం పగలగొట్టి మ్యూజియంలో ఉన్న వస్తువులను, త్రీడీ నమూనాలను కూడా ధ్వంసం చేశారు.  అద్దాలను రాళ్లతో పగలగొట్టారు. ప్రాంగణం లోపలికి వెళ్లే ద్వారం దగ్గర గేట్లను పీకి పడేశారు. కుర్చీలు, బల్లలు సహా దొరికిన వస్తువునల్లా ధ్వంసం చేశారు. అమరావతి ప్రాశస్త్యం, చరిత్ర తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఆనవాళ్లు ఏవీ లేకుండా చేశారు. అమరావతి నమూనాలను ధ్వంసం చేయడం దారుణమని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూపకల్పన చేస్తే అమరావతిని నిర్వీర్యం చేసి ముఖ్యమంత్రి జగన్‌  మోహన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అర్ధంతరంగా నిర్మాణాలు నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా ముళ్ల పొదలతో నిండిపోయిందని, మ్యూజియంలో నమూనాలను సైతం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
మరోవైపు ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మారరా.. మీ బుద్ధి మారదా?’ అంటూ వైసిపి వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ వికృత పోకడలను ఇంటికి పోయే ముందు కూడా మార్చుకోరా? విధ్వంసం, విషం చిమ్మే, మీ నీచమైన చర్యల్ని మానుకోరా?’ అని ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.