సీఎం జగన్‌‌పై రాయి దాడి కేసులో సతీష్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఒకవైపు ఈ ఘటనపై అధికార ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ఈ రాయి దాడి ఘటన.. ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. మరోవైపు సీఎంపై దాడి ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఈ కేసులో ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేయగా తాజాగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 13 వ తేదీన ఈ రాయి దాడి జరిగింది.
 
 విజయవాడలో బస్సు యాత్ర సాగుతున్న సమయంలో సింగ్‌ నగర్‌లోని వివేకానంద స్కూల్ వద్ద జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ రాయి దాడి చోటు చేసుకుంది. ఇక రాయితో కొట్టింది సతీష్ అనే వ్యక్తి అని పేర్కొన్న పోలీసులు.. అతడికి సహాయం చేసిన దుర్గారావుపై కూడా కేసు నమోదు చేశారు. ఏ1గా సతీష్, ఏ2గా దుర్గారావును చేర్చారు. 
 
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దుర్గారావు చెబితేనే సతీష్.. సీఎం జగన్‌పై దాడి చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు.  బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై ఉన్న సతీష్.. సిమెంట్ రాయి ముక్కతో బస్సుపై యాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
రాయితో దాడి చేసిన తర్వాత సతీష్, దుర్గారావులు తమకు ఇళ్లకు వెళ్లిపోయినట్లు విచారణలో వెల్లడైంది. ఇక సతీష్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. అనంతరం సతీష్‌ను అరెస్ట్ చేసి మెడికల్ టెస్ట్‌లు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు.
 
ఈ నెల 13 వ తేదీన మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌పై రాయి దాడి జరిగింది. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మ పై భాగంలో గాయం అయింది. ఈ సమయంలో సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం అయింది. వెంటనే అలర్ట్ అయిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను బస్సులోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత సీఎం జగన్.. బస్సు యాత్రను కొనసాగించారు.