ఐరాస సంస్కరణలకు అమెరికా మద్దతు

 
* భద్రత మండలిలో భారత్ కు శాశ్వత  సభ్యత్వంకు చైనా అడ్డు
 
భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ తెలిపారు. ఐరాసలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్‌ గతంలో మాట్లాడారని, విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు. ఐరాసలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
 
 ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై అమెరికన్‌ టైకూన్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఇటీవల చేసిన ప్రస్తావనకు స్పందిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు.  ఈ ఏడాది జనవరిలో భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం నిజంగా హాస్యాస్పదమని మస్క్ పేర్కొన్నారు.
 
శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ పరోక్షంగా అమెరికాపై విమర్శలు గుప్పించారు. ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. భద్రతా మండలిలో ఏ ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, 80 ఏళ్ల కిందటి మాదిరిగా ఇప్పటికీ కొనసాగకూడదని ఆయన స్పష్టం చేశారు.
 
ఈ పోస్ట్‌కు అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మైఖెల్‌ ఐసెన్‌బర్గ్‌ బదులిస్తూ.. ‘మరి భారత్‌ సంగతేంటీ?’ అని ప్రశ్నించారు. దీనిపై మస్క్ ట్వీట్ చేశారు. ‘ఐరాస, దాని అనుబంధ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం.. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అని మస్క్ అభిప్రాయపడ్డారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు భారత్‌ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. అయితే, భారత్‌ ప్రయత్నాలకు చైనా వంటి దేశాలు మోకాలడ్డుతున్నాయి.

ఈ భూమ్మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎలాన్‌ మస్క్‌ ఐరాస విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు.  కాగా, భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉండగా, భారత్‌కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. 

భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఐదు దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది. మండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ఈ ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఆ నిర్ణయం వీగిపోతుంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఐదింటిలో నాలుగు మద్దతు ఇస్తున్నా.. చైనా మాత్రం భారత్‌ ప్రయత్నాలకు అడ్డుపడుతోంది.