నెస్లే సెరిలాక్‌లో మోతాదుకు మించి షుగ‌ర్‌

భారతదేశంలో విశేషంగా బాలల ఆహార ఉత్పత్తులను అమ్ముతున్న నెస్లే కంపెనీ వాటిల్లో షుగర్ మిశ్రమం విషయంలో ద్వంద ప్రమాణాలను అనుసరిస్తున్నట్లు వెల్లడైంది. భారత్ లో అమ్మే ఉత్పత్తులను మోతాదులకు మించి షుగర్ కలుపుతున్నట్లు, ఐరోపా దేశాలలో మాత్రం ఆ విధంగా కలపటంలేదని ఆరోపణలు చెలరేగుతున్నాయి.
స్విట్జర్లాండ్ కు చెందిన పబ్లిక్ ఐ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ కంపెనీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ వంటి తక్కువ ఆదాయం గల దేశాలలో తమ బాలల ఆహార ఉత్పత్తులలో మోతాదుకు మించి షుగర్, తేనె కలుపుతూ ఉండడంతో వారి ఆరోగ్యంపై చూపే ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే, సంపన్న ఐరోపా దేశాల్లో ఈ విధంగా కలపకపోవడం గమనార్హం.
 
నెస్లే కంపెనీకి చెందిన మొత్తం 150 బాలల ఆహార ఉత్పత్తుపళ్లపైనా పబ్లిక్ ఐ శాస్త్రీయ అధ్యయనం జరిపింది. బాల్యంలో ఆహారంలో షుగర్ ఎక్కువగా కలిపితే ఊబకాయంతో పాటు పలు అనారోగ్యాలకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడం జరిగింది. భారత్ లో విక్రయిస్తున్న అన్ని రకాల సెరెలాక్ బాలల ఆహార ఉత్పత్తులలో మోతాదుకు మించి 3 గ్రాముల షుగర్ కలుపుతున్నట్లు వెల్లడైంది.
 
అయితే బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ, స్విట్జ‌ర్లాండ్ దేశాల్లో అమ్ముడ‌వుతున్న ఆ ఉత్ప‌త్తుల్లో షుగ‌ర్ లెవ‌ల్స్ సాధార‌ణ స్థాయిలో ఉన్న‌ట్లు ఈ దర్యాప్తులో తేలింది.  శిశువుల‌కు ఇచ్చే పాల‌ల్లో షుగ‌ర్‌తో పాటు తేన జోడించిన ఉత్ప‌త్తుల‌ను నెస్లే అమ్ముతోంది. ఈ అంత‌ర్జాతీయ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘించిన‌ట్లు నెస్టే కంపెనీపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సాధారణంగా ఆరు నెలలు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న బాలలకు ఈ ఆహార ఉత్పత్తులను వాడుతూ ఉంటారు.

ఊబ‌కాయం, దంతసంబంధ వ్యాధులు, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు కార‌ణ‌మైన షుగ‌ర్ మోతాదును ఎక్కువ‌గా వాడుతున్నార‌ని రిపోర్టులో పేర్కొన్నారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని నెస్లే ఉత్ప‌త్తుల్లోనే షుగ‌ర్ స్థాయి ఎక్కువ‌గా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. భారత్ ఉన్న 15 సెరిలాక్ బేబీ ఉత్ప‌త్తుల్లో స‌గ‌టున మూడు గ్రాముల అధిక షుగ‌ర్ ఉన్న‌ట్లు గుర్తించారు. 

కానీ నెస్లే ఇండియా కంపెనీ ప్ర‌తినిధి మాత్రం ఆ ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేశారు. గ‌త అయిదేళ్ల‌లో శిశువుల సెరిలాక్‌లో షుగ‌ర్‌ను 30 శాతం త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు. చిన్నారుల‌కు కావాల్సిన పోష‌క విలువ‌ల‌తో కూడిన ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అత్యుత్త‌మ‌, నాణ్య‌మైన వ‌స్తువుల‌ను వాడుతున్న‌ట్లు చెప్పారు. 

3 గ్రాముల షుగ‌ర్ ఎక్కువ‌గా ఉన్న సెరిలాక్ బేబీ ప్రొడ‌క్ట్స్‌ను భారత్ లో అమ్ముతుండ‌గా జ‌ర్మ‌నీ, బ్రిట‌న్ దేశాల్లో ఆ ఉత్ప‌త్తులో షుగ‌ర్ సాధార‌ణ స్థాయిల్లోనే ఉన్న‌ది. ఇక ఇథియోపియా, థాయిలాండ్ దేశాల్లో మాత్రం షుగ‌ర్ 6 గ్రాములు ఉన్న‌ట్లు అధ్యయనంలో క‌నుగొన్న‌ట్లు చెప్పారు.  అయితే అద‌న‌పు షుగ‌ర్ గురించి ఉత్ప‌త్తుల‌పై ఎటువంటి స‌మాచారం ఉండ‌ద‌ని తెలుస్తోంది. విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, న్యూట్రియంట్స్ గురించి చెప్పిన కంపెనీ..ఆ స్థాయిలో షుగ‌ర్‌ను క‌లిపిన‌ట్లు పేర్కొన్నారు. 2022లో భారత్ లో నెస్లే కంపెనీ సుమారు రూ. 20 వేల కోట్ల ఖ‌రీదైన సెరిలాక్ ఉత్ప‌త్తుల్ని అమ్మింది.