బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు ప్రశంసలు

బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు ప్రశంసలు

ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యాపార ప్రకటనలు ఇచ్చిన కేసులో యోగా గురు రాందేవ్, ఆయన సహచరుడు బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద సంస్థ వార్తాపత్రికలలో ప్రచురించిన బహిరంగ బేషరతు క్షమాపణలో గణనీయమైన మెరుగుదల ఉందని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశంసించింది.క్షమాపణ చెప్పిన భాష తగిన విధంగా ఉందని, పేర్లు కూడా అందులో ఉన్నాయని జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం మంగళవారం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి తెలిపింది. 

రెండవ క్షమాపణ ఎవరి ఆలోచనో తెలియదు కాని గణనీయమైన మెగరుదల ఉందని జస్టిస్ అమానుల్లా పేర్కొన్నారు. మొత్తానికి అర్థం చేసుకున్నందుకు వారిని అభినందిస్తున్నామని ఆయన చెప్పారు. వార్తాపత్రికలలో ప్రచురించిన క్షమాపణ ప్రకటన అసలు ప్రతిని కోర్టులో దాఖలు చేయాలని తాము ఆదేశించినప్పటికీ ఇఫైల్ ఎందుకు చేశారని రోహత్గీని జస్టిస్ అమానుల్లా ప్రశ్నించారు. తమ ఉత్తర్వులకు అనుగుణంగా ఇది లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

చాలా సమాచార లోపం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కోర్టు ఉత్తర్వులను తాను తన కక్షిదారునికి తెలియచేయడంలో కొంత సమాచార లోపం జరిగిందని రోహత్గీ ఒప్పుకున్నారు. క్షమాపణ ప్రకటన ప్రచురించిన అన్ని వార్తాపత్రికల ప్రతులను కోర్టుకు సమర్పించడానికి మరో అవకాశం ఇవ్వాలని రోహత్గీ కోరారు. ఈ పత్రాలను స్వీకరించవలసిందిగా రిజిస్ట్రీని ఆదేశించింది.

కాగా, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు సంబంధించిన తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనల కేసులో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా మందలించింది. సంస్థ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన తర్వాత లైసెన్సింగ్ అథారిటీ నుంచి చర్యలు మొదలైనట్లు కనపడుతోందని పేర్కొంది.

“మీ పట్ల సానుభూతి కలగాలంటే నిజాయితీగా మాట్లాడండి” అంటూ లైసెన్సింగ్ అథారిటీని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో లైసెన్సింగ్ అథారిటీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుందా లేదా అన్నదే తమ ప్రధాన ప్రశ్న అని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను మే 14వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.