`ఓట్ జిహాద్’ పిలుపు.. సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలిపై ఎఫ్ఐఆర్

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు, సమాజ్‌వాదీ పార్టీ నేత మారియా ఆలం ఖాన్  ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. మతం పేరుతో ఆమె ఓట్ల అడగడంపై ఎఫ్ఐఆర్  నమోదైంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ‘ఓట్ జీహాద్’ తప్పనిసరి అని ఫరూఖాబాద్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. 

మారియా ప్రసంగం వీడియా సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్ కావడంతో బీజేపీ వెంటనే స్పందించింది. ర్యాడికలిజాన్ని ఆమె ప్రోత్సహిస్తున్నారని మండిపడింది.  ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్‌పుఠ్ తరఫున తిరుగుతున్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరిపై కూడా మారియా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వారి అనుచిత ప్రవర్తనకు తప్పనిసరిగా శిక్ష పడుతుందని హెచ్చరించారు. ”అందరూ కలిసికట్టుగా ఉందాం. అంతా నిశబ్దంగా, సామూహికంగా ఓటు వేయాలి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఓట్ల జీహాద్ ఒక్కటే మార్గం” అని ఆమె పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్‌సీకి సంబంధించి కేసులపైన, జైళ్లలో ఉన్న వారిని విడుదల చేసేందుకు సల్మాన్ ఖుర్షీద్ పోరాడుతున్నారని కూడా ఆమె చెప్పారు. కాగా, ఎఫ్ఐఆర్‌లో సల్మాన్ ఖుర్షీద్ పేరు కూడా చేర్చారు.

‘ఓటు జిహాద్’ కోసం ఆమె పిలుపుపై రాజకీయ తుఫాను చెలరేగడంతో, బిజెపి సల్మాన్ ఖుర్షీద్ పాత వీడియో మరొకదానిని తెరపైకి తీసుకొచ్చింది. అందులో  పరిపాలనలో ముస్లింలకు ‘అధిక ప్రాతినిధ్యం’ కోసం వాదిస్తూ అటువంటి పాలనా యంత్రాంగంను ఓట్లలోకి ఎలా ‘అనువదించుకోవచ్చో’  పార్టీ సహచరులకు ఉపదేశయించారు.

సల్మాన్ ఖుర్షీద్‌కి సంబంధించిన పాత వీడియోను షేర్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, మరియా ఖాన్ తన మేనమామ నుంచి రాడికాలిజం, మతోన్మాదం వారసత్వంగా పొందారని విమర్శించారు. “మే 2016లో వాట్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్, బ్రౌన్ యూనివర్శిటీ, రోడ్ ఐలాండ్‌లో ఖుర్షీద్ మాట్లాడుతూ, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పట్టణ ప్రాంతాల్లోని జ్ఞానోదయం కలిగిన, ఆలోచనాపరులైన ముస్లింలను కాంగ్రెస్ ‘వెనక్కి తీసుకోవడం’ కోసం తాను సూచించిన విధానాన్ని కాంగ్రెస్ ఏవిధంగా ఆశ్రయించిందో వివరించారని చెప్పారు.

ఈ వ్యూహం, యుపిఎ-1, యుపిఎ-2 ప్రభుత్వాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించిందని ఆయన తెలిపారని మాల్వియా ఎక్స్‌లో రాశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌కు ‘ముస్లిం బుజ్జగింపు పాత ఆచారం’ ఉన్నందున కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా అదే కోణంలో చూడాలని ఆయన సూచించారు.

నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. సల్మాన్ ఖుర్షీద్ కూడా ముస్లిం రిజర్వేషన్ల కోసం ఎస్సి, ఎస్టీ,ఓబీసీలకు నష్టం కలిగించే విధంగా కాంగ్రెస్ వ్యవహరించేటట్లు చేయడంలో తోడ్పడ్డారని, అయితే న్యాయ వ్యవస్థ జోక్యంతో ముస్లింలకు 4 శాతం ఉప కొత్త రద్దయిందని బిజెపి నేత వివరించారు.