ఒలింపిక్స్‌కు పివి సింధు వరుసగా మూడోసారి అర్హత

ఒలింపిక్స్‌కు పివి సింధు వరుసగా మూడోసారి అర్హత సాధించింది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బిడబ్ల్యుఎఫ్‌) మంగళవారం ప్రకటించింది. బిడబ్ల్యుఎఫ్‌ తాజాగా ప్రకటించిన టాప్‌-16లోపు ర్యాంకర్లందరూ నేరుగా ఒలింపిక్స్‌లో ఆడేందుకు అర్హులు. 

ఈ క్రమంలో మహిళల సింగిల్స్‌లో పివి సింధు (12వ ర్యాంక్‌) పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకుంది. దీంతో వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌ బరిలో పివి సింధు నిలిచినట్లయ్యింది. సింధు తొలిసారి 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించగా.. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా రజత పతకంతో సత్తా చాటిన విషయం తెలిసిందే. 

ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణరు రారు (9వ ర్యాంక్‌), లక్ష్యసేన్‌ (13వ ర్యాంక్‌)లో నిలిచి నేరుగా ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకున్నారు. అలాగే మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తానీషా కాస్ట్రో (13వ ర్యాంక్‌), పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ (2వ ర్యాంక్‌)లకు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లు దక్కాయి. నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి ఏ విభాగంలోనైనా ఒలింపిక్స్‌లో ఆడేందుకు ఇరువురికి మాత్రమే అవకాశం ఉంది.

ఇలా ఉండగా, మూడేండ్ల క్రితం టోక్యో (జపాన్‌) వేదికగా ముగిసిన ఒలింపిక్స్‌లో భాగంగా భారత్‌ తరఫున ఫెన్సింగ్‌ ఆడిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవీ పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తును దక్కించుకోవడంలో విఫలమైంది. యూఏఈలోని ఫుజైర వేదికగా జరుగుతున్న ఆసియా ఒషియానియా జోనల్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో ఆమె సెమీస్‌లోనే నిష్క్రమించింది. ఈ టోర్నీ ఫైనల్‌లో గెలిచిన విజేతలు మాత్రమే విశ్వక్రీడలకు అర్హత సాధించనుండగా ఒలింపిక్స్‌కు ఇవే చివరి క్వాలిఫయర్స్‌.