ఎన్డీయే పాలనలో ఈడీ సోదాల్లో 85 రేట్లు పెరుగుదల

బీజేపీ పదేండ్ల పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు, ఆస్తుల స్వాధీనం అనూహ్యంగా పెరిగాయి. గత యూపీఏ పాలనతో పోలిస్తే బీజేపీ ప్రభుత్వ హయాంలో మనీ లాండరింగ్‌ చట్టం కింద ఏకంగా 86 రెట్లు అధికంగా సోదాలు, 25 రెట్లు అధికంగా ఆస్తుల అటాచ్‌మెంట్లు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

తమను కేంద్రం టార్గెట్‌ చేసిందనడానికి ఈ గణాంకాలు నిదర్శనమని విపక్షాలు పేర్కొంటుండగా, అవినీతిపై చిత్తశుద్ధితో పోరాటానికి ఇవి తార్కాణమని కేంద్రం వాదిస్తున్నది. 2002 లోనే మనీలాండరింగ్‌ నిరోధక చట్టాన్ని(పీఎంఎల్‌ఏ) ప్రవేశపెట్టినా, 2005 జూలై 1 నుంచి దీనిని అమలు చేశారు. 

ఎన్డీఏ హయాంలో 2014 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు, యూపీఏ హయాంలోని 2005 జూలై నుంచి 2014 మార్చి వరకు ఈడీ జరిపిన దాడులకు సంబంధించి విశ్లేషించిన డాటా ప్రకారం  ఎన్డీఏ హయాంలో 36 కేసుల్లో 63 మందికి శిక్ష పడగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో 73 చార్జిషీట్లను పరిష్కరించారు. ఈ కేసుల్లో ఎవరికీ శిక్ష పడలేదు. 

అదే సమయంలో పీఎంఎల్‌ఏ చట్టం కింద ఎలాంటి కేసులు పరిష్కరించలేదు. గత పదేండ్లలో విదేశాలకు పారిపోయిన నలుగురిని భారత్‌కు రప్పించారు. అయితే వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, సంజయ్‌ భండారీలు యూకేకు పారిపోయినా వారిని రప్పించడంలో మాత్రం కేంద్రం విఫలమైంది.