బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను నాలుగు రోజుల పోలీస్ రిమాండ్‌కు ముంబై కోర్టు ఆదివారంనాడు ఆదేశించింది. ‘స్టయిల్’, ‘ఎక్స్యూజ్‌ మీ’ వంటి పలు హిందీ చిత్రాల్లో సాహిల్ నటించారు.
 
దీనికి ముందు, మహదేవ్ బెట్టింగ్ కేసులో నిందితుడైన సాహిల్ ఖాన్ తాత్కాలిక బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును ముంబై హైకోర్టు తోసిపుచ్చడంతో ఆయన ముంబై నుంచి పరారైనట్టు కథనాలు వచ్చాయి. దీంతో ఛత్తీస్‌గఢ్ పోలీసుల సాయంతో ముంబై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం 40 గంటల సేపు గాలింపు చర్యలు జరిపి ఛత్తీస్‌గఢ్‌లో ఆయనను అరెస్టు చేసింది. 
 
ఆదివారం ఉదయం ఆయనను ఛత్తీస్‌గఢ్ నుంచి ముంబై తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరిచింది.  వివాదాస్పద మహదేవ్ బెట్టింగ్ యాప్‌కు చెందిన ప్రమోటర్లతోనూ, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలతోనూ సాహిల్ ఖాన్ అక్రమ లావాదేవీలు నడిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ముంబై సిట్ దర్యాప్తు చేస్తోంది. సా
 
హిల్ ఖాన్ బ్యాంకు అకౌంట్లు, మొబైల్ ఫోన్లు, ఇతర సాంకేతిక సామాగ్రిని సైతం సైబర్ సెల్ పరిశీలిస్తోంది. మహదేవ్ బట్టింగ్ యాప్ సబ్సిడరీకి ప్రమోషన్ చేసిన నటి తమన్నా భాటియాకు కూడా ఈ వారం ప్రారంభంలో దర్యాప్తు సంస్థ సమన్లు పంపింది.  గత ఏడాది మహదేవ్ బెట్టింగ్ యాప్‌ యాడ్స్‌లో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ కనిపించడం పతాకశీర్షికల్లో రావడంతో వారిని ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు పంపింది.
మహదేవ్ బెట్టింగ్ యాప్‌ ఆపరేషన్‌ను దుబాయ్‌ నుంచి సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ నడిపేవారు. ఈ ఇరువురూ ఛత్తీస్‌గడ్‌లోని భిలాయ్‌కు చెందినవారు. ఈ ఇద్దరికీ పలువురు పోలీసులు, ఉన్నతాధికారులు, రాజకీయవేత్తలతో సంబంధాలు ఉన్నాయని, విచారణ సంస్థల దృష్టిలో బెట్టింగ్ యాప్ పడకుండా చూసేందుకు రెగ్యులర్‌గా వారికి పేమెంట్లు చెల్లించేవారని ఈడీ ఆరోపిస్తోంది.