జులైలో వందే మెట్రో రైల్‌ ట్రయల్‌ రన్‌!

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో సెమీ హైస్పీడ్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తాజాగా వందే భారత్‌ మెట్రో రైలును సైతం ప్రారంభించేందుకు రైల్వేశాఖ యోచిస్తున్నది.  ఇంట్రా సిటీ రవాణాలో విప్లవాత్మకంగా మార్పులు తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రాజెక్టు సీనియర్‌ అధికారి తెలిపారు. వందే మెట్రో కోసం అన్ని సన్నాహాలు కొనసాగుతున్నాయని.. ఈ ఏడాది జూలైలో ట్రయల్‌ రన్‌ నిర్వహించబోతున్నట్లు అధికారి పేర్కొన్నారు.

తద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు ప్రయాణికులకు అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు. రైలు క్షణాల్లోనే అధిక వేగాన్ని అందుకోవడం, తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్‌లను కవర్‌చేసేలా అత్యాధునిక టెక్నాలజీతో రైళ్లను తీసుకురాబోతున్నట్లుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

ఈ ఏడాది వందే మెట్రోను ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా నిర్ధేశించారు. రెండునెలల్లో ట్రయల్‌ రన్‌ ప్రారంభం కానున్నది. అయితే, ఏ మార్గంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారనేది తెలియరాలేదు. మెట్రోలో ఆటోమేటిక్‌ డోర్లు, కంఫర్ట్‌ కోటియన్‌తో పాటు ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లలో అందుబాటులో లేని అనేక ఫీచర్లు ఇందులో ఉంటాయని అధికారులు తెలిపారు.

 త్వరలోనే ఫీచర్స్‌తో పాటు ఫొటోలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. వందే మెట్రో ఓ విలక్షణమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను ఉంటుందని.. ప్రతి యూనిట్‌లో నాలుగు కోచ్‌లు ఉంటాయి. కనీసం 12 మెట్రో కోచ్‌లతో రైలును ప్రవేశపెట్టనున్నారు. డిమాండ్‌ ఆధారంగా 16 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏ రూట్‌లో వందే మెట్రోను నడిపించే విషయంపై సైతం కసరత్తు జరుగుతోందని అధికార వర్గాలు వివరించాయి.