సీఎం జగన్ పై దాడిలో పోలీస్ అధికారుల పాత్రపై విచారించాలి

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడికి బాధ్యత వహించాల్సిన పోలీస్  అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రశ్నించారు.  రాయి దాడి జరగడానికి అధికారులు ఏర్పాటు చేయాల్సిన భద్రతా లోపమే కారణమని.. ఆ ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయించడం సరికాదని స్పష్టం చేశారు.

ఈ దాడి విషయంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి ముందు విచారణ చేయించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులక రాయి విసిరిన చేయి, ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుందని స్పష్టం చేశారు. సూత్రధారులు, పాత్రధారులెవరో అప్పుడే తేలుతుందని పేర్కొన్నారు.

గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకెళ్లినా పరదాలు కట్టి చెట్లు కొట్టేసేవారన్న పవన్‌, గతంలో అన్నీ సభలు పట్టపగలే నిర్వహించారు కదా? అని ప్రశ్నించారు. మరి ఏ ఉద్దేశంతో విజయవాడలో విద్యుత్ నిలిపి చీకట్లో యాత్ర చేయించారని ఆయన నిలదీశారు. భద్రతా పరమైన సమస్యలున్న ముఖ్యమంత్రి పర్యటన ఆ విధంగా జరిగేందుకు ఎవ్వరు బాధ్యులో తేల్చాలని ఆయన కోరారు.

పరదాలూ కట్టలేదు, చెట్లూ కొట్టలేదని గుర్తు చేశారు. భద్రతా చర్యల్లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటో తేలాలని ఆయన తేల్చి చెప్పారు. గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో జరిపిన పర్యటన సందర్భంగా కూడా భద్రతాపరమైన లోపాలు వెల్లడయ్యాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

ఇలాంటి అధికారులు ఉంటే మళ్లీ ప్రధాని వచ్చినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తారని చెబుతూ  వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

జనాలలోంచే రాయి విసిరారు

ముఖ్యమంత్రికి తగిలిన దెబ్బలను బట్టి క్యాట్ బాల్ లేదా ఎయిర్ గన్ వాడి ఉంటారని అనుమానాలు వ్యక్తం కాగా అందుకే తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ముఖ్యమంత్రిపై పడిన రాయి చేతితోనే విసిరారని  విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. సీఎంకు తగిలిన రాయి సైజు కూడా చేతిలో సరిపోయేంత సైజులోనే ఉన్నట్లుగా గుర్తించామని ఆయన తెలిపారు.

నిందితుడు దొరికితే దాడి వెనుక గల కుట్ర కోణం తెలుస్తుందని సీపీ చెప్పారు. అయితే, రాయిని చాలా బలంగా, వేగంగా విసిరారని.. అందుకే ఇద్దరికీ గాయం అయ్యిందని చెప్పారు.