ఏపిలో కూటమికి 18 ఎంపీ స్థానాలు

ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు రోజులలో ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేస్తుండడంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాలలో నిమగ్నమయ్యాయి. విజయమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ఓవైపు,  టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 

గురువారం నుంచి నామినేషన్ల పర్వం కూడా మొదలు కాబోతోంది. ఇప్పటికే పలు జాతీయ సర్వేలు ఏపీ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వెలువరించాయి. తాజాగా మరో జాతీయ మీడియా సంస్థ న్యూస్ ఎక్స్ తన సర్వే ఫలితాలను వెల్లడించింది.

ఏపీ లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర నిరాశ ఎదురవుతుందని న్యూస్ ఎక్స్ తెలిపింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను టీడీపీ సొంతంగా ఏకంగా 14 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తున్న 6 స్థానాల్లో రెండింటిలో విజయకేతనం ఎగురవేస్తుందని తెలిపింది. జనసేన పోటీ చేస్తున్న రెండు స్థానాలనూ కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. 

మొత్తమ్మీద కూటమి 18 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. అధికార వైసీపీ కేవలం 7 ఎంపీ స్థానాలు పరిమితం అవుతుందని సర్వేలో తేలినట్టు వెల్లడించింది. ఇవే ఫలితాలను శాసనసభ ఎన్నికలకు అన్వయిస్తే కూటమి 126 వరకు సీట్లను కైవసం చేసుకుంటుంది. వైసీపీ 49 స్థానాలకు పరిమితం అవుతుంది. ఇటీవల సీఎన్‌ఎన్‌-న్యూస్‌18, ఇండియాటుడే సర్వేల్లో కూడా టీడీపీ కూటమి సింహభాగం ఎంపీ సీట్లను గెలుస్తుందని వెల్లడైంది.