జగన్‌పై దాడి దర్యాప్తును వేగవంతం చేయాలని ఈసీ ఆదేశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి  వ్యవహారంలో దర్యాప్తను వేగవంతం చేయాలని ఈసీ సీఈఓ మీనా ఆదేశించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ కాంతి రాణా, ఐ.జి. రవిప్రకాష్‌లను పిలిపించి సోమవారం సచివాలయంలో దర్యాప్తు వివరాలు తెలుసుకున్న సీఈఓ మీనా, దర్యాప్తు వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు.

ముఖ్యమంత్రి  నిర్వహిస్తున్న “మేమంతా సిద్దం” బస్సు యాత్రలో దాడి ఏ విధంగా చోటు చేసుకుంది? దాడి చేసేందుకు నిందితులకు ఏ విధంగా అవకాశం ఏర్పడింది? పూర్తి స్థాయిలో బందోబస్తు ఉన్నప్పటికీ నిందితులు ఏ విధంగా రాయితో దాడిచేయగలిగారు? అనే విషయాలపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు.

ఈ ఘనటకు సంబందించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితుల విచారణ ఏ విధంగా సాగుతున్నదో అడిగి తెలుసుకున్నారు. ఆ విచారణలో బయటపడిన విషయాలపై సీఈఓ ఆరా తీశారు. ఈ కేసుకు సంబందించిన దర్యాప్తును మరింత వేగవంతం చేసి సమగ్ర నివేదికను సాద్యమైనంత త్వరగా అందజేయాలని ఆదేశించారు.

కాగా, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై రాయితోనే దాడి చేశారని విజయవాడ సీపీ కాంతిరాణానిర్ధారించారు. ఎయిర్ గన్‌‌తో చేసిన దాడి కాకపోవచ్చని చెబుతూ రాయిని దేనితో విసిరారనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ  ఫుటేజీలను విశ్లేషించిన తర్వాత నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు.  దాడి చేసిందెవరో ఇంకా గుర్తించలేదని, తమ వద్ద ఉన్న ఆధారాలతో నిందితుడిని గుర్తించెందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

ఈ కేసు దర్యాప్తు కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బస్సు యాత్ర వెంబడి మొత్తం 40 రోప్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్, ఏపీఎస్పీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, యాక్సిస్ కంట్రోల్ సిబ్బంది కూడా పనిచేశారని వివరించారు. బస్సు యాత్రకు అడ్డంకులు ఉన్న  వీలైనన్ని చోట్ల కరెంట్ నిలిపివేస్తారని వివరణ ఇచ్చారు. 

సెక్యూరిటీ, సేఫ్టీ కోసం రూఫ్ టాప్ వీఐపీ ప్రోగ్రామ్ ఉన్నచోట కరెంట్ సరఫరా నిలిపివేస్తారని, బస్సుయాత్ర డాబా కొట్లు దాటి వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి బలంగా రాయి విసిరాడని సీపీ చెప్పారు. రాయి సీఎం కంటిపై తగిలిన తర్వాత వెల్లంపల్లి కంటికి తగిలిందని, కేసు దర్యాప్తు కోసం గతంలో పనిచేసిన అధికారులతో కలిపి టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. 

ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించామని చెప్పారు. 50మందికి పైగా అనుమానితులను విచారించామని, అతి తొందర్లోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. జగన్‌పై దాడికి సంబంధించి దృశ్యాలు, ప్రస్తుతం జరుగుచున్న దర్యాప్తు ప్రగతిని వీడియోలు, ఫొటోల ద్వారా పోలీస్ కమిషనర్  మీనాకు వివరించారు.

జగన్‌పై దాడికి సంబంధించి దృశ్యాలు, ప్రస్తుతం జరుగుచున్న దర్యాప్తు ప్రగతిని వీడియోలు, ఫొటోల ద్వారా కాంతి రాణా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. మరోవంక, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనల్లో ఇటు వంటి దుర్ఝటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో విఐపిల ప్రచార భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశంపై ఆరాతీశారు.