ఈసీ రికార్డు స్థాయిలో రూ. 4,650 కోట్లు జప్తు

దేశంలో ఎన్నికల సమయంలో కట్టల కొద్దీ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు పట్టుపడుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం రికార్డు స్థాయిలో, గత 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మొత్తం పట్టుబడినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది.  ఈసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 13వ తేదీ వరకు తొలి విడతలో డబ్బు, మద్యం, బంగారం, ఇతర వస్తువుల రూపంలో మొత్తం రూ. 4,650 కోట్లు రికవరీ అయ్యింది.
 
అంటే సగటున రోజుకు రూ. 100 కోట్ల మేర రికవరీ జరిగినట్లు. ఇందులో నగదు రూ.395.39 కోట్లు కాగా, బంగారం, వెండి వంటి విలువైన లోహాల రూపంలో రూ.562.10 కోట్లు రికవరీ చేసినట్లు ఈసీ తెలిపింది. అలాగే రూ.489.31 కోట్ల విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యం పట్టుపడినట్లు పేర్కొంది. ఈ ఏడాది మొత్తం రికవరీలో సింహభాగం మాదకద్రవ్యాలదే కావడం గమనార్హం.  
 
రూ.4,650 కోట్ల రికవరీలో 45 శాతం మేర మాదక ద్రవ్యాలే ఉన్నట్లు ఈసీ తెలిపింది. మొత్తంగా రూ.2,068.85 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 2019 ఎన్నికల సమయంలో రూ. 1,279.9 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.  ఇక టీవీలు, ఫ్రిడ్జిలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో రూ. 1,142.49 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వివరించింది. 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మొత్తం అని ఈసీఐ తన డేటాలో వెల్లడించింది.

గత లోక్‌సభ ఎన్నికల సమయంలో రూ. 3,475 కోట్లకు పైగా పట్టుబడింది. గత ఎన్నికల సమయంలో పట్టుబడిన దానితో పోలిస్తే ఇది 34 శాతం అధికమని తెలిపింది. సమగ్ర ప్రణాళిక, సంయుక్త కార్యాచరణ, దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాల మధ్య సమన్వయంతో పాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోగల్గుతున్నామని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 4,658 కోట్లలో రాజస్థాన్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 13వ తేదీ వరకూ మొత్తం రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత రూ. 605 కోట్లతో గుజరాత్ తర్వాతి స్థానంలో నిలిచింది. 

ఇక తమిళనాడులో రూ.460.8 కోట్లు, మహారాష్ట్రలో రూ.431.3 కోట్లు, పంజాబ్‌లో రూ. 311.8 కోట్లు పట్టుబడింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లద్దాక్, లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి.

2024 లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. తొలి ఫేజ్‌ ఎన్నికలు ఏప్రిల్‌ 19న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 26న రెండో విడత‌, మే 7న మూడో విడత‌, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్‌ 1న ఏడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక తొలి దశలోనే ఇంత మొత్తంలో నగదు రికవరీ కావడం గమానర్హం. ఎన్నికలు ముగిసే సరికి ఇంకా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.