దివ్యాంగుల హక్కులు నిజ జీవిత వాస్తవికతగా మారాలి

స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, వాగ్దానాలని, దివ్యంగులతో సహా అందరికీ అన్ని వేళలా అవి అందుబాటులో ఉండాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు  డాక్టర్ డి. మనోహర్ ములే స్పష్టం చేశారు. మానస చిన్నారుల ఆరోగ్య వైకల్యాల అధ్యయన సంస్థ లో “దివ్యాంగుల మానవ హక్కుల పరిరక్షణ” అనే అంశంపై మంగళవారం జరిగిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. 
 
సమ్మిళిత సమాజం, వైవిధ్య భరిత సమాజం  గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని చెబుతూ అవి రోజువారీ దిన చర్యలలో తప్పనిసరిగా ప్రతిబింబించాలని ఆయన సూచించారు. దివ్యాంగుల హక్కుల ఉల్లంఘన, వారికి జరిగిన అన్యాయాల గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు  ఫిర్యాదులు పెద్దగా అందడం లేదని, అయితే దేశంలో ప్రతి విషయం సవ్యంగా ఉందని అర్థం కాదని ఆయన పేర్కొన్నారు. 
 
అన్యాయానికి గురైన దివ్యాంగులకు  ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం  అందుబాటులో ఉందని తెలియక పోవటం కారణం అని చెప్పారు. పౌరులందరూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అన్యాయం లేదా  చట్టపరమైన హక్కుల ఉల్లంఘన ఎవరైనా దృష్టికి వస్తే, మానవ హక్కుల కమిషన్ వెబ్ సైట్  ద్వారా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

సమ్మిళిత విద్య చట్ట బద్ద ప్రమాణం కాబట్టి కేవలం వైకల్యం కారణంగా పాఠశాలలు ఏ విద్యార్థికీ  ప్రవేశం నిరాకరించరాదని  ఆయన స్పష్టం చేశారు. వివిధ కేటగిరీల వికలాంగులతో వారి వికాసం కొరకు  భిన్నమైన రీతిలో వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతూ సామాజిక న్యాయం పట్ల అశ్రద్ధ తగదని పేర్కొన్నారు. దివ్యాంగుల చట్ట బద్ద హక్కులు నిజ  జీవన వాస్తవికతగా మార్చేందుకు ప్రభుత్వం, పౌరులు చురుకుగా నిబద్దతతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

ఉస్మానియా యూనివర్శిటీ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ జి.బి. రెడ్డి మాట్లాడుతూ వైకల్యం కారణంగా వివక్షతకు గురికాకుండా ఉండటం ప్రస్తుతం చట్టబద్ధమైన హామీ అని, దానిని రాజ్యాంగ హామీ స్థాయికి పెంచాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు దివ్యాంగుల హక్కుల సబ్జెక్టును బోధించడం లేదని పేర్కొంటూ 106 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం కనీసం ఐచ్ఛిక సబ్జెక్టుగా దీనిని అందించడం ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు.

ఎర్రగడ్డలో ప్రభుత్వ మానసిక వైద్యశాలలో డాక్టరుగా, ప్రొఫెసర్ గా  పనిచేస్తున్న డాక్టర్ ఆర్. అనిత మాట్లాడుతూ, మేధో వైకల్యం ఉన్న పిల్లల కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనించామని తెలిపారు. ఆలస్యంగా వివాహాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, గర్భధారణ సమయంలో తల్లికి ఇన్ఫెక్షన్ సోకటం, సరైన పోషకాహారం లేకపోవడం, ఫోర్సెప్స్ డెలివరీ మొదలైనవి ఈ పెరుగుదలకు కొన్ని కారణాలని ఆమె పేర్కొన్నారు. 

 
శారీరకంగా 20 నుండి 30 సంవత్సరాల వయస్సు వివాహానికి,  గర్భధారణకు అనువైన వయస్సు అని ఆమె సూచించారు. బిడ్డ పుట్టిన తర్వాత, అధిక మరియు సరికాని టీకాలు ఇప్పించటం, స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల అధిక వినియోగం ఆటిజం లేదా సూడో ఆటిజం పెరగడానికి కారణమని ఆమె పేర్కొన్నారు. 
 
విటమిన్ లోపం, జంక్ ఫుడ్, రసాయన ప్రిసర్వేటివ్స్ తో  కూడిన ప్యాక్ చేసిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వంటివి ఎ.డి.హెచ్.డి. అనే మానసిక రుగ్మతకు కారణాలుగా అనుమానించబడుతున్నాట్లు ఆమె వివరించారు. పిల్లల్లో వచ్చే మేధో వైకల్యాలకు సంబంధించి అన్ని రకాల నివారణ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె సూచించారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు ఎస్.విజయభారతి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మానస స్పెషల్ స్కూల్ విద్యార్థి మాస్టర్ విష్ణు భట్ భక్తి గీతాలు పాడి సభికులను ఆకట్టుకున్నారు. 

 
మానస ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మెర్సీ మధురిమ మానస కార్యకలాపాల నివేదికను అందజేస్తూ స్పీచ్ థెరపీ లేదా ఫిజియోథెరపీ అవసరమైన పిల్లలు మానస న్యూరో డెవలప్‌మెంటల్ క్లినిక్‌లో సేవలను పొందవచ్చని, మేధోపరమైన వైకల్యం ఉన్న పిల్లలు మానస స్పెషల్ స్కూల్‌లో సేవలను పొందవచ్చని తెలిపారు. మానస కోశాధికారి శ్రీ టి.మదన్ మోహన్ రెడ్డి వందన సమర్పణ చేశారు.