కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా డా. వంశీ తిలక్‌

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్ వంశీ తిలక్‌ను పార్టీ  ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతోఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు ఈసీ షెడ్యూలు విడదల చేయటంతో పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి.
 
మెుదటగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆ పార్టీలో చేరిన వెంటనే అభ్యర్థిగా ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదితకు అవకాశం ఇచ్చారు పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు. 
 
తాజాగా బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టీఎన్ వంశీ తిలక్ పేరును ఖరారు చేశారు. తొలితరం రాజకీయ నేత, మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి కుమారుడే ఈ తిలక్. ఆమె సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన వారు. 1957లో తొలిసారిగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు.
 
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో తొలి దళిత దేవాదాయ మంత్రిగా సేవలందించారు. 1969లో తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి కొన్నేళ్ల పాటు కొనసాగారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి 2000లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2004లో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు.

ఈమె కుమారుడు తిలక్ గత కొంతకాలంగా బీజేపీలో క్రియాశీలంగా ఉన్నారు. ఆయన తండ్రి టి ఎస్ నారాయణ సహితం ప్రముఖ సామాజిక కార్యకర్తగా పేరొందారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.