శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్హులుకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. 1996 డిసెంబర్‌ 29న జరిగిన దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది.  ఐదుగురు దళితుల్ని చిత్ర హింసలకు గురి చేసి శిరోముండనం చేసిన వ్యవహారంలో 28ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువడింది. 

కోర్టు తీర్పుపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం కోసం సుదీర్ఘ కాలం పాటు పోరాడిన తీర్పుతో తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేవారు. ఈ కేసు విచారణ సుదీర్ఘ కాలం సాగింది. విచారణలో 24 మంది సాక్షుల్లో 11మంది మృతి చెందారు. శిరోముండనం ఘటనకు సంబంధించి 1994లో వివాదం మొదలైందని, సిమెంట్ కంపెనీ ధ్వంసం కేసులో తమపై తప్పుడు కేసులు పెట్టడంతో వివాదం మొదలైందని బాధితుడు కోర్టు తీర్పు తర్వాత వివరించారు.

1994లో రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక దళితులపై దాడులకు పాల్పడ్డారు. రాజకీయంగా తమకు ఎదురొస్తున్నారనే అక్కసుతో ఐదుగురు దళితుల్ని హింసించి కనుబొమ్మలు తొలగించి, శిరోముండనానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన సమయంలో టీడీపీ అధికారంలో ఉంది.

ఘటన జరిగిన 28ఏళ్ల తర్వాత వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పును వెలువరించింది. శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాత్రను ప్రాసిక్యూషన్ నిరూపించింది. నిందితుల్లో ఒకరు మరణించగా 9మందికి శిక్షలు ఖరారు చేశారు.

నిందితులకు రూ. 2 లక్షల జరిమానా, 18 నెలల జైలు శిక్షను ఖరారు చేశారు. 1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఘటన జరిగింద. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. 2018 వరకు 148 సార్లు కేసు వాయిదా పడింది. ఆ తర్వాత నిరవధికంగా విచారణ కొనసాగింది. ప్రస్తుతం మండపేట వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో తోట త్రిమూర్తులు ఉన్నారు. 1997 జనవరి 1న కేసు నమోదైంది. 1994లో తోట త్రిమూర్తులు రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. 

స్థానికంగా తనకు వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతో దాడి చేసి హింసించారని బాధితులు ఆరోపించారు. ఈ కేసు విచారణలో రకరకాల మలుపులు తిరిగింది. కోనసీమ జిల్లాలో విచారణ సక్రమంగా జరగడం లేదనే ఆరోపణతో విచారణకు విశాఖకు మార్చారు. విచారణ కాలంలో మొత్తం ఆరుగురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. 

దేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సంచలనం సృష్టించిన కేసుల్లో వెంకటాయపాలెం కేసు ఒకటి. కోర్టు తీర్పు వెలువరించిన సమయంలో తోట త్రిమూర్తులు కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. దర్యాప్తును, విచారణను అడ్డుకోడానికి రకరకాల ప్రయత్నాలు జరిగిన ప్రాసిక్యూటర్లు న్యాయం వైపు నిలిచారని, ఎన్ని ఒత్తిళ్లు, అటంకాలు ఎదురైనా వెనుకంజ వేయలేదని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. నిందితులకు శిక్షలు పడాలనే తమ పోరాటం ఇన్నేళ్లకు ఫలించిందని దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.