సంఘ వ్యతిరేకులతో రాహుల్ ‘రహస్య ఒప్పందం’

కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ సిట్టింగ్ ఎంపీ రాహుల్‌ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఘాటు విమర్శలకు దిగారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో నిషేధానికి గురైన ఒక సంస్థకు చెందిన రాజకీయ విభాగంతో రాహుల్ ‘రహస్య ఒప్పందం’ కుదుర్చుకున్నారని ఆరోపించారు. 
 
సోమవారం కేరళ  రాష్ట్రంలోని కున్నంకుళంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటూ రాహుల్‌ పేరును ప్రస్తావించకుండా ‘‘కాంగ్రెస్‌ యువరాజు’ తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోలేకపోయారని ధ్వజమెత్తారు.  యూపీలో తన కుటుంబానికి చెందిన స్థానాన్ని కాపాడుకోలేక మౌనంగా ఉన్నారని (ఏళ్ల తరబడి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఉద్దేశిస్తూ) చెప్పారు. 
 
అయితే, కేరళ ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తని ఆయన ఓట్లు మాత్రం అడుగుతాడు’ అంటూ రాహుల్‌పై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ హెచ్చరించారు. కేరళలో వామపక్షాలను ఉగ్రవాదులుగా పోల్చి, వారితోనే ఢిల్లీలోనే చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం కాంగ్రెస్ పార్టీ వంచనకు నిదర్శనమని ఆరోపించారు. 
 
ఎల్‌డీఎఫ్- యూడీఎఫ్ హయాంలో కేరళలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నారని ఆందోళన వ్యక్తం చశారు. జాతీయ రహదారులతో సహా ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అవరోధాలు కల్పిస్తోందని విమర్శించారు.  బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప్ పాత్ర’ను మోదీ ప్రస్తావిస్తూ, ఇది దేశ అభివృద్ధికి కట్టుబడి, మోదీ గ్యారెంటీలతో రూపొందించిన మేనిఫెస్టో అని అని చెప్పారు.
 
 ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ ద్వారా కేరళలోని 73 లక్షల మంది లబ్దిదారులకు ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత చికిత్స అందిస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ‘వికాస్’, ‘విరాసత్’ అనేది బీజేపీ విజన్ అని తెలిపారు. సహజ సౌందర్యానికి ప్రతీక పాలక్కాడ్ అని కొనియాడారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేస్, హైస్పీడ్ వందే భారత్ రైళ్లతో కేరళను గ్లోబల్ హెరిటేజ్‌‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.
 
దేశంలో గత పదేళ్ల ఎన్డీయే పాలనలో చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని చెబుతూ ఇంకా చేయాల్సింది ముందు ముందు చాలా ఉందని ప్రధాని పేర్కొన్నారు. కేరళతోపాటు దేశ ప్రగతికి చేయాల్సింది చాలా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘గత పదేళ్లలో జరిగింది కేవలం ట్రైలర్‌ మాత్రమే. కేరళ సహా భారత్‌ కోసం చేయాల్సింది ఇంకా చాలా ఉంది’ అని తెలిపారు.