న్యాయవ్యవస్థను అణచివేసే ప్రయత్నాలు

న్యాయవ్యవస్థను అణచివేసే ప్రయత్నాలు
పథకం ప్రకారం ఒత్తిడి తేవడం, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయడం, బాహాటంగా అవమానించడం వంటి చర్యల ద్వారా న్యాయవ్యవస్థను అణచివేయాలని కొన్ని వర్గాలు తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నాయని సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన పలువురు మాజీ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌కు ఓ లేఖ రాశారు. 
 
దీనిపై 21 మంది న్యాయకోవిదులు సంతకాలు చేశారు. వారిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు దీపక్‌ వర్మ, కృష్ణ మురారి, దినేష్‌ మహేశ్వరి, ఎంఆర్‌ షా, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు పెర్మద్‌ కోహ్లీ, ఎస్‌ఎం సోనీ, అంబాదాస్‌ జోషీ, ఎస్‌ఎన్‌ ధింగ్రా తదితరులు ఉన్నారు.
 
‘ఈ శక్తులు తమ సంకుచిత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మన న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేందుకు కృషి చేస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇందుకోసం వారు అనేక రకాలుగా కృత్రిమ పద్ధతులు అనుసరిస్తున్నారు. మన న్యాయస్థానాలు, న్యాయమూర్తుల సమగ్రతపై దురుద్దేశాలు ఆపాదించడం ద్వారా న్యాయ ప్రక్రియలను బలహీనపరచేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోంది’ అని ఆ లేఖలో మాజీ న్యాయమూర్తులు తెలియజేశారు.
 
ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థ పవిత్రతను అగౌరవపరచడమే కాకుండా చట్టాన్ని సంరక్షించే వారిగా ఏ న్యాయ సూత్రాలకు, నిష్పాక్షికతకు కట్టుబడి ఉంటామని న్యాయమూర్తులు ప్రమాణం చేశారో వాటికి నేరుగా సవాలు విసురుతున్నాయని  ఆందోళన వ్యక్తం చేశారు.
 
‘న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడం, ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చడం వంటి ఎత్తుగడలు అవలంబించడంపై మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి ప్రయత్నాలు అనైతికమైనవే కాకుండా మన ప్రజాస్వామ్య వ్యవస్థ మూల సూత్రాలకు హానికరం. ఒకరి అభిప్రాయానికి అనుగుణంగా ఉన్న న్యాయవ్యవస్థ నిర్ణయాలను పొగడడం, లేకుంటే విమర్శించడం ఉద్దేశపూర్వకంగానే జరుగుతోంది’ అని వివరించారు.
 
సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థ ఇలాంటి ఒత్తిడులకు తలొగ్గరాదని మాజీ న్యాయమూర్తులు కోరారు. న్యాయవ్యవస్థ పవిత్రతను, స్వతంత్రతను పరిరక్షించాలని సూచించారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా నిలవాలని, క్షణికమైన రాజకీయ ప్రయోజనాల కల్పనలు, కోరికలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
‘న్యాయవ్యవస్థకు మేము సంఘీభావం తెలుపుతున్నాము. దాని గౌరవాన్ని, సమగ్రతను, నిష్పాక్షికతను పరిరక్షించేందుకు అవసరమైన మద్దతు అందిస్తాము. సవాళ్లతో కూడిన ఈ సమయంలో మీ మార్గనిర్దేశాన్ని, నాయకత్వాన్ని కోరుకుంటున్నాము. న్యాయవ్యవస్థ న్యాయానికి, సమానత్వానికి ఓ మూలస్తంభంగా ఉండాలని అభిలషిస్తున్నాము’ అని ఆ  లేఖలో న్యాయకోవిదులు ఆకాంక్షించారు.