సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో సత్వర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 
 
కేసు విచారణను 29న విచారణ జరుపనున్నది. సుప్రీంకోర్టులో అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. కేసు తదుపరి విచారణను వేగవంతం చేయాలని కోరారు. 
 
అయితే ఈ నెల 29లోపు విచారణ జరపలేమని కోర్టు తెలిపింది. ఈ నెల 19న విచారణకు జాబితా చేయాలని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది కోరగా ధర్మాసనం ఇందుకు నిరాకరిస్తూ 29న విచారణకు జాబితా చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించనుంది.మద్యం పాలసీ కుంభకోణంలో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో తిహార్‌ జైలులో ఉన్నారు.

ఇదిలాఉంటే.. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రివాల్‌కు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. దీంతో ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు.

ఇలా ఉండగా, తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ను కరడుగట్టిన క్రిమినల్స్ కంటే దారుణంగా చూస్తున్నారని, ఒక గ్లాస్‌ వాల్ గుండా ఫోనులో ఆయన తనతో మాట్లాడారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

”గ్లాసు గోడ మరకలతో మసకమసకగా ఉంది. ఒకరి ముఖం మరొకరు చూసుకోవడం కూడా చాలా కష్టం. ఎలా ఉన్నారని ఆయనను అడిగాను. ఆయన తన గురించి చెప్పలేదు. పంజాబ్ గురించి అడిగారు. రైతులు ఏంచేస్తున్నారు? పంట కోతలు మొదలయ్యాయా? అని అడిగారు. ఆప్ మొహల్లా క్లినిక్‌ల గురించి విచారించారు” అని తెలిపారు. 

“ప్రజలకు సకాలంలో ఉచిత కరెంట్ అందుతోందా అని అడిగారు. ఆయన ఆందోళన అంతా ప్రజల గురించే. ప్రజలకు పని చేయడం కోసం రాజకీయాలు ఉంటాయి కానీ రాజకీయాల కోసం రాజకీయాలు చేయం. మేము దేశభక్తులం. దేశం కోసమే మా పోరాటం” అని భగవంత్ మాన్ చెప్పారు.