శ్రీరామనవమికి ముస్తాబవుతున్న అయోధ్య

శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య నగరం ముస్తాబవుతున్నది. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. రామలల్లా  పెద్ద సంఖ్యలో భక్తులు రాగలరని సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 25 లక్షల మంది భక్తులు రాగలరని  భావిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి ఎస్ మిశ్రా తెలిపారు. ఈ క్రమంలో 15 నుంచి 18 వరకు రామ్‌లల్లా దర్బారులో వీఐపీ దర్శనాలను రద్దు చేసింది. సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవని మార్గదర్శకాలను జారీ చేస్తూ ట్రస్టు తెలిపింది. 
 
ఏప్రిల్ 15 నుంచి 18 మధ్య వీఐపీ పాస్‌లు చేసిన వారి పాస్‌లు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. చైత్ర శుక్ల సప్తమి అంటే సోమవారం నుంచి అయోధ్యలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రామమందిరం ట్రస్ట్ వీఐపీ దర్శనాలకు బ్రేక్‌ వేసింది.  ఆయా తేదీల్లో వీఐపీ ప్రోటోకాల్ హోల్డర్స్‌ అయోధ్యకు రావద్దని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. 
 
రద్దీలో వీఐపీ దర్శనం సాధ్యం కాదని చెప్పారు. ఇప్పటికే జారీ చేసిన స్పెషల్, సుగమ్ పాస్‌లు 18 వరకు చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పాస్ హోల్డర్లకు వీఐపీ సౌకర్యాలు ఇవ్వలేమన్నారు. మరో వైపు ఆలయంలో నవమి వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.రామజన్మభూమి మార్గంలో అదనంగా 80 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్గంలో జర్మన్ హ్యాంగర్లు ఉండడంతో కొన్ని కెమెరాలు సుదూర దృశ్యాలను మాత్రమే తీయగలుగుతున్నాయి. ఈ క్రమంలో క్లోజ్ అప్ దృశ్యాలను చిత్రీకరించేందుకు అదనపు కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో దాదాపు 50 చోట్ల వాటర్ కూలర్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. 

ప్రస్తుతం రామ్‌లల్లా దర్శన వేళ్లలో మార్పులపై చర్చ జరుగుతున్నది. ఈ నెల 16 నుంచి బాల రాముడి దర్శన సమయాలను మార్చాలని నిర్ణయించారు. మొదట 15 నుంచే మార్చాలని భావించగా.. భక్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్పులు చేయలేదు. 16 నుంచి దాదాపు 20 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చేయాల్సిన ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు టీటీడీ సాయం కోరింది. శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం అయోధ్యను సందర్శించి రామాలయ నిర్వహణ, యాత్రికులకు కల్పించవలసిన సౌకర్యాలు వంటి అంశాలపై ఇంజనీరింగ్ అధికారుల బృందం తయారు చేసిన సాంకేతిక సలహాలతో కూడిన నివేదికను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులకు అందజేశారు.