సీఎం జగన్ పై దాడి చేసిన వాళ్లను పట్టిస్తే రెండు లక్షల బహుమతి

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి వ్యవహారంలో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేక పోయారు. పోలీసుల అదుపులో అనుమానితులు ఉన్నారని ప్రచారం జరిగినా అదంతా ఒట్టిదేనని తేలిపోయింది.  శనివారం రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు పారితోషకం అందిస్తామని దర్యాప్తు అధికారులు ప్రకటించారు. 
 
సిఎం జగన్‌పై దాడి కేసు దర్యాప్తు కోసం ఇప్పటికే ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిపై దాడి గురించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలని కోరారు. గత శనివారం విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడిలో జగన్‌తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి గాయపడ్డారు.
 
దాడికి సంబంధించిన నిందితులను పట్టుకోడానికి దోహదపడే ఖచ్చితమైన సమాచారం, దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చని విజయవాడ పోలీసులు ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా నేరుగా వచ్చి సమాచారం అందించవచ్చని, ఈ కేసుకు దోహదపడే సమాచారం అందించిన వారికి రూ.2 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. సమాచారమును అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

దాడికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారము తెలియ చేయాలనుకునే వారు డీసీపీ కంచి శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్‌సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ఫోన్ ద్వారా గాని, వాట్స్ అప్ ద్వారా గాని, నేరుగా కూడా వచ్చి తెలియచేయవచ్చని తెలిపారు.

ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ డిసిపి కంచి శ్రీనివాసరావు 9490619342, టాస్క్‌ఫోర్స్‌ ఏడిసిపి శ్రీహరిబాబుల – 9440627089కు సమాచారం ఇవ్వొచ్చని సూచించారు. పశువుల ఆస్పత్రి రోడ్డులోని నేతాజీ బ్రిడ్జి రోడ్ లో ఉన్న టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలోనైనా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.