చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై రాళ్లు విసిరిన దుండగులు

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరగ్గా, ఆదివారం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదలపై కూడా రాళ్లు విసిరారు. 
 
ముఖ్యమంత్రిపై రాయి విసరడం భద్రతా వైఫల్యంగా సర్వత్రా భావిస్తుండగా, ప్రతిపక్ష నాయకులపై కూడా రాళ్లు విసరడం గమనిస్తే ఏపీలో ఎన్నికలు హింసాత్మకంగా మారే  ప్రమాదం  ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పైగా, సీఎం జగన్ పై దాడి జరిగిన మరుసటి రోజే ఇద్దరు కీలక ప్రతిపక్ష నాయకులపై దాదాపు అటువంటి దాడులు జరగడం విస్మయం కలిగిస్తుంది.
 
విశాఖపట్నంలోని గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు చంద్రబాబుపైకి రాయి విసిరి అక్కడ్నుంచి పరారయ్యాడు. అయితే, చంద్రబాబుకు తగలకుండా పక్కకుపడింది. ప్రజాగళం వాహనం వెనుక నుంచి రాయి విసిరి అక్కడ్నుంచి పరారు కావడంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 
 
వరుస రాళ్ల దాడుల ఘటనలు జరుగుతుండటంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నిన్న చీకట్లో సీఎం జగన్‌పై గులకరాయి పడింది. ఇప్పుడు కరెంటు ఉన్నప్పుడే నాపై రాయి విసిరారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఈ పనిచేస్తోంది” అని చంద్రబాబు ఆరోపించారు.  “తెనాలిలో పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్లు వేశారు. విజయవాడలో నిన్న జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా. గత ఎన్నికలప్పుడు కూడా నాపై రాళ్లు వేశారు. క్లైమోర్ మైన్స్‌కే భయపడలేదు. ఈ రాళ్లకు భయపడతానా?” అని చంద్రబాబు మండిపడ్డారు.

“నిన్న జగన్ సభలో కరెంట్ పోయింది. ఎవరు బాధ్యత వహించాలి. కరెంట్ బంద్ చేసిన వారిపై, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జగన్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు. దాడులు చేస్తే.. చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా?” అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కాగా రాయి విసిరిన వ్యక్తి ఎవరు? ఈ దాడి వెనుక గల కారణాలేంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 
“జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయి హత్యను నా మీద నెట్టాలని ప్రయత్నించారు. విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించాం. పేటీఎం బ్యాచ్ కుక్కలు ఇష్టానుసారంగా మోరిగాయి. రాళ్లు నేనే వేయించినట్లు మాట్లాడారు” అని చంద్రబాబు మండిపడ్డారు.
 
 మరోవంక, ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి విజయభేరి యాత్రలో పవన్ పాల్గొనేందుకు వచ్చిన సమయంలో  ఆయనపై రాయి విసిరారు. పవన్ హెలీకాప్టర్ దిగాక హెలీప్యాడ్ వద్ద  ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో పవన్‍‌కు ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దుండగుడు విసిరిన రాయి పవన్ కళ్యాణ్‌కు దూరంగా వెళ్లిపడింది. దీంతో జనసేనానికి ఎలాంటి గాయం కాలేదు.
 
రాయి విసిరిన ఆగంతకుణ్ని జనసైనికులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే వారాహి యాత్రలో జరిగిన ఘటన పవన్ కళ్యాణ్ అభిమానులను కలవరపెట్టింది.  రాయి విసిరిన వ్యక్తి ఎవరు? ఏ ఉద్దేశంతో అతను రాయి విసిరాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రాయి కనుక తగిలి ఉంటే పవన్ కళ్యాణ్ గాయపడేవారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జనసేనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.