జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రత్యేక కోర్టు  కోరిన సీబీఐ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. గత 12 ఏళ్లుగా ఈ కేసు విచారణ ముందుకు జరగకుండా డిశ్చార్జ్ పిటీషన్ల పేరుతో జాప్యం జరుగుతూ ఉండటం, తరచూ న్యాయమూర్తులు బదిలీ అవుతూ ఉండడంతో విచారణ ఎప్పటికప్పుడు మల్లి మొదటికి వస్తుండటం వంటి జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పలు విషయాలను సీబీఐ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. 
 
కేసులో దాఖలైన క్వాష్‌, డిశ్చార్జ్‌ పిటిషన్లపై తీర్పులు ఇవ్వక ముందే ఆరుగురు న్యాయమూర్తుల బదిలీ అయ్యారని, ఈ కేసులో ఇప్పటివరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలు అయ్యాయని, వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే… జడ్జీలకు స్థానచలనం అవుతోందని సీబీఐ పేర్కొంది.
తాజా న్యాయమూర్తి కూడా కనీసం రెండేళ్లు కాకుండానే బదిలీ అయ్యారని, ఈ కేసులో ఉన్న నిందింతులు అంతా… శక్తిమంతులేనని సీబీఐ పేర్కొంది. 
 
ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారని, విచారణ వేగంగా జరగాలంటే సీబీఐ కోర్టులో ఖాళీలు భర్తీచేయాలని సీబీఐ అభిప్రాయపడింది. ఒక ప్రిన్సిపల్ కోర్టుకు ఈ కేసు రోజువారీ విచారణ బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టుకు సీబీఐ దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి చేసింది. 

ఇందులో 911 మంది సాక్షులున్నారని, అంతా 50 ఏళ్లు పైబడిన వారేనని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. కాగా జగన్‌ అక్రమాస్తుల కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపి రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పి విచారణలో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

గత విచారణ సందర్భంగా సీబీఐ తీరుపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశంతో జగన్‌ అక్రమాస్తుల కేసులో ట్రయల్‌ కోర్టులో జరుగుతున్న వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థ ధర్మాసనం ముందు ఉంచింది. జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు 2013లో దాఖలైంది.  ఆ తర్వాత 95 మంది నిందితులు, కంపెనీలు డిశ్చార్జి పిటీషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారని, నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లలో ఒకటి హైకోర్టు ముందు, 8 సుప్రీంకోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని సీబీఐ పేర్కొంది.