జగన్ పై దాడి కేసులో పోలీస్ అధికారులపై చర్య!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే ప్రసంగాలు కారణం అంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన వైసిపి నేతలు టీడీపీ వారీ దాడి చేయించారని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనలో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడి కావడంతో సంబంధిత పొలిసు అధికారులపై చర్యలు అనివార్యంగా కనిపిస్తున్నది.
 
ఏకంగా ముఖ్యమంత్రి పైన దాడి జరగటం ఏంటని ఎన్నికల కమిషన్  సీరియస్ అయింది. దీనికి సంబంధించి నివేదిక అందిన తరువాత అధికారులపైన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఇక నుంచి జగన్ పాల్గొనే ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోల పైన తాజాగా పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ముఖ్యులకు సూచనలు చేశారు. 
 
బస్సు యాత్ర చేసే సమయంలో వంద మీటర్ల వరకు దూరం పాటించాలని సూచించారు. యాత్ర సమయంలో గజమాలలు, క్రేన్ ల ద్వారా అభినందనలు మినహాయించాలని పేర్కొన్నారు. బస్సు నుంచి ప్రచారం చేసే సమయంలో ఖచ్చితంగా బారికేడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
అదే విధంగా సభల సమయంలో ప్రజల మధ్యకు వెళ్తున్నారని..ఆ సమయంలో జాగ్రత్తలు అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు.

సీఎం జగన్ పై దాడికి సంబంధించి విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఏస్పీ స్థాయి అధికారితో సిట్ బృందం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
జగన్ పై దాడికి సంబంధించి వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ దాడిని సీరియస్ తీసుకోవాలని కోరారు. అలాగే చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
 
జగన్ పైన విజయవాడలో జరిగిన దాడితో పోలీసు శాఖ అప్రమత్తమైంది.  దాడి ఘటనపై విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. విచారణ జరుగుతుందని చెప్పిన అధికారులు 20 మందితో ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ సమీపంలోని స్కూలు పైన నుంచి ఈ దాడికి పాల్పడినట్లు ప్రాధమికంగా నిర్దారణకు వచ్చారు. 
 
అజిత్ సింగ్ నగర్ లో మూడు సెల్ ఫోన్ టవర్స్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై వేల ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఇదంతా వైసీపీ ఆడుతున్న నాటకమని టీడీపీ ఆరోపిస్తోంది. చిన్న గాయానికి 18మంది డాక్టర్లతో చికిత్స అవసరమా అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటి పెద్ద సర్జరీలకే 5, 6మంది డాక్ట్రర్లు ఉంటారని, అలాంటిది చిన్న గాయానికి అంత మంది డాక్టర్లు ఏంటని ప్రశ్నించారు.