నిధులు మళ్లించి దళితులకు వెన్నుపోటు పొడిచిన జగన్

దళితులకు చెందిన నిధులు దారిమళ్లించడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి  వారికి వెన్నుపోటు పొడిచారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ విమర్శించారు.  తెలుగుదేశం అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాల రావు, జనసేన అధికార ప్రతినిధి డాక్టర్ విజయ కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే ఎన్. ఎస్. ఎఫ్. డి. సి, ఎన్.ఎస్ కే ఎఫ్ డి. సి, ఎన్. బి ఎఫ్. డి సి  నిధులతో పాటు  మైనారిటీ లకు  ఇచ్చే నిధులు కూడా ప్రక్క దారి పట్టించారని ధ్వజమెత్తారు. 
 
తద్వారా ఎస్. సి, ఎస్టీ, బిసి, మైనారిటీ లకు కేంద్రం ఇచ్చే నిధులను దారిమళ్లించి,  వారి ఆర్ధిక మూలలు ధ్వంసం చేసిన  జగన్ మాదిరిగా దేశంలో మరే ముఖ్యమంత్రి ఇటువంటి దుస్సాహసం చేయలేదని విమర్శించారు.  ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా ఎస్ సి, ఎస్ టీ సబ్ ప్లాన్ నిధులు వేలాది కోట్ల రూపాయిలు  ఖర్చు చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. 
 
పైగా, వాటిని నవరత్నాలలో కలిపి చూపడం అంటే ఎస్ సి, ఎస్ టీ లకు ద్రోహం చేయడమే అని, ఇదే పరిస్థితి బీ సి సంక్షేమంలో కూడా కనబడుతున్నదని చెప్పారు.  ముఖ్యంగా ఎస్ సి , ఎస్ టీ సబ్ , బీ సి, మైనారిటీ, కాపు  సబ్ ప్లాన్ నిధులు  2019  – 20  నుండి 2022  – 23   సంవత్సరాలలో దాదాపు రూ. 2.30 లక్షల కోట్లు కేటాయిస్తే, అందులో  రూ.1.60 లక్షల కోట్లను మాత్రమే, వాటిని కూడా  నవరత్నాలు లో కలిపి చూపి ఖర్చు చేశారని పేర్కొన్నారు. 
 
రూ. 70 వేల కోట్లు అసలు ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.  మరో వంక 2023 – 24లో కేవలం ఎస్ సి, ఎస్ టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు మరో రూ. 28,000  కోట్లు పక్కదారి పట్టగా, మొత్తం దాదాపు రూ. 98 వేల కోట్ల నిధులు  ఏమి అయ్యాయి, ఎవరి జేబులలోకి  తరలించారో  జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
వివిధ శాఖల నుండి ప్రతి ప్రభుత్వం చేసే చెల్లింపులనే నవరత్నాలు అని ప్రచారం చేసుకోవడం అంటే ఆయా వెనుకబడిన వర్గాలను మోసగించడమే అని దుయ్యబట్టారు. జగన్ రద్దు చేసిన 26 పధకాలు తిరిగి పునరుద్దరణ చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని ఆయన చెప్పారు. డాక్టర్ సుధాకర్ ని బట్టలు విప్పి కొట్టి.. అతడి చావుకు కారణమైన జగన్ ని చరిత్ర క్షమించదని హెచ్చరించారు. 
 
దళితుడైన సుబ్రహ్మణ్యంను హత్య చేసిన అనంతబాబుని ప్రక్కన పెట్టుకున్న జగన్ ని దళితులు ఎప్పటికీ క్షమించరని స్పష్టం చేశారు. తానే కత్తితో పొడిపించుకొని  అమాయకుడైన శ్రీనివాసుని ఐదేళ్లు జైల్లో ఉంచిన ముఖ్యమంత్రి అని విమర్శించారు.  దళితుడైన శ్రీనివాస్ కు ఐదేళ్లు తిరిగి జగన్ ఇవ్వగలడా? అని ప్రశ్నించారు. 
 
దళితులకు ఇచ్చే భూ పంపిణీ, ఇన్నోవా కార్లు టెంట్ హౌస్ లాంటి పథకాలతో పాటు  అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో జరిగాయని, తద్వారా దళితులకు ఉపాధి కలిగేదని గుర్తు చేశారు. యువతకు ఉపయోగపడే విదేశీ విద్య నుండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కొరకు తీసివేసి బడుగులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు.
 
 వైసీపీ లోని దళిత నేతలు బయటకు వచ్చి ఆత్మ గౌరవం కాపాడు కోవాలని విల్సన్ పిలుపిచ్చారు. అదే బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఇచ్చే నివాళి అవుతుందని హితవు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాసిరకం మద్యం ద్వారా 45 ఏళ్ల కే ప్రాణం కోల్పోతున్న వాళ్ళల్లో 90 శాతం బడుగులే ఉన్నారని తెలిపారు.  
 
మధ్యం, ఇసుక, మైనింగ్ పేరుతో రాష్టాన్ని జగన్ లూటీ చేశారని దుయ్య బట్టారు.  రాష్ట్రం అప్పుల పాలు కాగా జగన్ మాత్రం సంపన్నుడయ్యాడని విల్సన్  విరుచుకు పడ్డారు. జగన్ ఇచ్చిన ఆరంకణాల స్థలం స్కీం కూడా ఒక స్కామ్ అని తెలిపారు. రూ. 11 లక్షల కోట్లు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇప్పుడు ప్రతి కుటుంబం పైన రూ.10 లక్షల వరకు అప్పులు పడేలా చేశారన్నారని ధ్వజమెత్తారు.
 
కాగా ఉపాధి కల్పించే దిశలో బిజెపి మేనిఫెస్టో ఉంటుందని, బడుగు వర్గాలకు పెద్దపేట వేస్తుందని విల్సన్ కొనియాడారు. బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో 11 విద్యాసంస్థలు కోట్లాది నిధులు ఇచ్చి అభివృద్ధికి బాటలు వేసిందని చెప్పారు. బిజెపి తెలుగుదేశం హయాంలోనే పోలవరం 72 శాతం పూర్తి అయిందని గుర్తు చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 45 సంస్థల్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి ఉంటే లక్షలాది మందికి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేదని తెలిపారు. వాలంటీర్ల జీవితాలతో చెలగాటమాడుతూ వారి జీవితంలో విలువైన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వృధా చేసిందని,  ఆఖరికి పెన్షన్ పేరుతో వృద్ధులు చనిపోవడానికి కూడా కారణం  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని తెలిపారు.