ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి

తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా నీరుగార్చేందుకు, కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లకుండా కాపాడేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బిజెపి ప్రధాన కార్యదర్శి, ఎంపీ  బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అదే మంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో లాలూచి పడి, చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కదోవ పట్టించాడంటూ ఆరోపించారు.
 
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌ స్టేట్‌మెంట్‌లో కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడని బండి సంజయ్ పేర్కొన్నారు. అయినా ఈ కేసులో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం ఆశ్చర్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్ జరిగిందని పేర్కొంటూ కరీంనగర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సంబంధం ఉందని సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న అశోక్ రావు ప్రభాకర్ రావుకు వియ్యంకుడని, ఆ బంధుత్వంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ రావు ఇంట్లోనే ఉండి ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా నడిపారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు చెప్పారని, ఆయన ఏం చెప్పారో పోలీసు రికార్డులో ఉందని తెలిపారు. “ఫోన్ ట్యాపింగ్‌లో నేను, రేవంత్‌రెడ్డి కూడా బాధితులమే. ఫోన్ ట్యాపింగ్‌ ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతోంది. నా కుటుంబసభ్యులు, సిబ్బంది ఫోన్లనూ ట్యాప్ చేశారు” అని ఆరోపించారు.

“317 జీవో, టీఎస్‌పీఎస్సీ వివాదంలోనూ నా అరెస్టుకు ఫోన్ ట్యాపింగే కారణం. ఫోన్ ట్యాపింగ్‌ విషయంలో హరీశ్‌రావు కూడా బాధితుడే. ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావు కరీంనగర్ వాసి. అన్ని ఆర్థిక లావాదేవీలు నడిపింది ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావే.” అని తెలిపారు.

కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్న రాజేందర్‌రావు ఖర్చులన్నీ అశోక్‌రావే చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆయన ఇంట్లోనే రాజేందర్‌రావు ఉన్నారని, ప్రభాకర్‌రావు, అశోక్‌రావు ద్వారా కాంగ్రెస్ నేతలకు రూ.కోట్లు చేరాయని తెలిపారు. గల్లీ నుంచి దిల్లీ వరకు డబ్బులు చేతులు మారాయని చెప్పారు.

 
‘నయీం కేసు, డ్రగ్స్ కేసు, మియాపూర్ భూముల కేసు లెక్కనే ఫోన్ ట్యాపింగ్‌ను నీరుగారుస్తున్నారు. మంత్రికి, కేసీఆర్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం ఏంటి?. కరీంనగర్‌కు చెందిన మంత్రి ద్వారా డిల్లీకి డబ్బులు వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలి’ అని సంజయ్ డిమాండ్ చేశారు. 
 
ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు ముడిపడిన అంశం అంటూ, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని స్పష్టం చేశారు.  సీబీఐకి ఇవ్వకపోతే ఈ కుంభకోణంతో హస్తం పార్టీ సంబంధం ఉన్నట్లే అని చెబుతూ ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అనుమానం కలుగుతుందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే తన వద్ద ఉన్న ఆధారాలను వాళ్లకే ఇస్తానని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.