ఓటుకు నోటు కేసులో సుపారి ఎవరిచ్చారు? 

* సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన రాణి రుద్రమ

ఐదు స్థానాల్లో గెలిచేందుకు సుపారీ ఇచ్చారని సీఎం అన్నారని పేర్కొంటూ ఓటుకు ఓటు కేసులో ఎవరు సుపారి ఇచ్చారు? ఎవరు తీసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న వ్యక్తి ఇవాళ సీఎం అయ్యారని చెబుతూ అసలు సుపారీ ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసని ఆమె ఎద్దేవా చేశారు. 
 
సుపరిపాలన అంటేనే బీజేపీదని స్పష్టం చేస్తూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు సుపారి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆమె నిలదీశారు.  ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్‌ చిత్ర విచిత్ర వ్యాఖ్యలు చేశారని చెబుతూ జాతీయ స్థాయి రాజకీయాలపై ఆయనకు అవగాహన లేదని అర్థమవుతోందని రాణి రుద్రమ ధ్వజమెత్తారు. 
 
పాక్‌కు వెళ్లి పోటీ చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు అవసరమని, తమకు కాదని ఆమె స్పష్టం చేశారు. నిరాశ నిస్పృహల్లో కాంగ్రెస్ ఉందని అంటూ కాంగ్రెస్‌కు పాక్‌పై ప్రేమ బాగా పుట్టుకొస్తున్నట్లు ఉందని ఆమెతెలిపా రు. బీజేపీకి 400 సీట్లు వస్తే రేవంత్‌కు పాక్‌ టికెట్‌తో పాటు పింఛన్‌ వచ్చే ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. 
 
కాంగ్రెస్ డీఎన్‌ఏ పాకిస్థాన్‌ అని.. నెహ్రూ నుంచి రాహుల్‌ వరకు అందరికీ పాక్‌పై ప్రేమ ఉందని బిజెపి నేత మండిపడ్డారు. వాళ్లను పాక్‌కు తీసుకెళ్లాలని, ఉన్న 40 సీట్లు కాపాడుకోవాలని చెబుతూ అవి కాపాడుకుంటే కాంగ్రెస్‌ వాళ్లే గొప్పొళ్లు అని ఆమె సవాల్ చేశారు.  దేశ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసిన ఘనత బీజేపీదని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాడాలని ఆమె హితవు పలికారు. అధికారంలోకి వచ్చి 120 రోజులు కాలేదని, రాహుల్ జేబు దొంగ అని చెప్పాడని ఆమె పేర్కొన్నారు. దేశంలో జీరో కరప్షన్ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని తెలుపుతూ అవినీతి చేస్తే ఎవరినీ వదలబోమని రాణి రుద్రమ స్పష్టం చేశారు. అవినీతి లెక్కల్లో.. ఓటుకు నోటు కేసు వస్తుంది కాబట్టే రేవంత్‌కు భయం మొదలైందని ఆమె చెప్పారు. అందుకే అవినీతి అంశాన్ని ఎత్తుకున్న తమపై రాజకీయం కోసం మాత్రమే ఈ అంశాన్ని ఎత్తుకున్నారని ఆమె విమర్శించారు.