ఏపీకి 5.5, తెలంగాణకు 8.5 టీఎంసీల సాగర్ నీరు

నాగార్జునసాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణ 8.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ మేరకు కేటాయింపులు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. వాస్తవానికి 14 టీఎంసీలు కావాలని ఏపీ, 10 టీఎంసీలు కావాలని తెలంగాణ డిమాండ్‌ చేశాయి. కానీ, వారి డిమాండ్లను తిరస్కరించిన కమిటీ కుదరదని తేల్చిచెప్పింది. 
 
హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ రెండు గంటలకుపైగా జరిపిన భేటీలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. శ్రీశైలం, సాగర్‌ల నుంచి తెలంగాణకు 35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలను గతేడాది అక్టోబరులో జరిగిన బోర్డు సమావేశంలో కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ కోటా నీటి వినియోగంపై పరస్పరం ఆరోపణలు
 
కేటాయించిన కోటాకు మించి 11 టీఎంసీలు ఎక్కువగా తెలంగాణ వాడుకుందని ఆరోపించిన ఏపీ, ఇప్పుడు అదనంగా 10 టీఎంసీలు అడగడం సబబు కాదని పేర్కొంది. అక్టోబర్ నాటి కేటాయింపులకన్నా తాము తక్కువే వినియోగించుకున్నామని, ఇంకా ఐదు టీఎంసీలు విడుదల చేయాల్సి ఉందని గుర్తు చేసింది. 
 
దీనిపై తెలంగాణ స్పందిస్తూ ‘రాష్ట్ర పరిధిలోని కృష్ణా నదీ పరివాహకంలో జనాభా ఎక్కువ ఉంది. హైదరాబాద్‌ మహానగరంతోపాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలు దీని పరిధిలో ఉన్నాయి. మొత్తం 2 కోట్ల జనాభా తాగునీటి అవసరాలు దీంతో ముడిపడి ఉన్నాయి. ఏపీలో బేసిన్‌ పరిధిలోని 17 లక్షల జనాభాకే తాగునీరు అందాల్సి ఉందని’ వాదించింది. సాగర్‌ జలాలను తాము తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకున్నామని తెలిపింది.
 
ఏపీ 14 టీఎంసీలు, తెలంగాణ 10 టీఎంసీలు అడుగుతున్నందున శ్రీశైలం నుంచి దిగువకు నీటిని వదులుదామని బోర్డు సభ్యుడు శంఖ్వా ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తమ కోటా కన్నా ఎక్కువగానే తెలంగాణ వినియోగించుకుందని ఆయన పేర్కొన్నారు. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు, గతేడాది జూన్‌ నుంచి ఇరు రాష్ట్రాల కృష్ణా జలాల వినియోగం లెక్కలు తీస్తే ఎవరు ఎక్కువ వినియోగించుకున్నారో స్పష్టత వస్తుందని పేర్కొంది. 
 
ఆ రాష్ట్రంలో నీటి వినియోగంపై బోర్డు పరిశీలన చేయాలని కోరింది. తెలంగాణకు ప్రత్యేకంగా రిజర్వాయర్లు లేకపోవడంతో గతేడాది క్యారీ ఓవర్‌ కింద ఉన్న 18.7 టీఎంసీలు ఉమ్మడి జలాశయాల్లోనే ఉండిపోయాయని, ఏపీ మాత్రం పెన్నా బేసిన్‌కు తరలించి నిల్వ చేసుకుందని ఆరోపించింది.  తాగునీటి అవసరాల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. 
 
సాగర్‌ నుంచి గరిష్ఠంగా నీటిని తోడుకునే స్థాయి (ఎండీడీఎల్‌) 510 అడుగులు కాగా, 500 అడుగుల నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించింది. ‘ప్రస్తుతం సాగర్‌లో 510.53 అడుగుల వద్ద 132.86 టీఎంసీలు ఉన్నాయి. 500 అడుగులకుపైన 17.55 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి.. మే నెల వరకు తెలుగు రాష్ట్రాల అవసరాలకు 14 టీఎంసీలను వినియోగించుకోవాలి. 
 
మిగతా 3.55 టీఎంసీలను భవిష్యత్‌ అవసరాలకు మినహాయించాలి’ అని బోర్దు నిర్దేశించింది. మొత్తంగా శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదలకూడదని త్రిసభ్య కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. మే నెలలో మరోసారి సమావేశం నిర్వహించి అప్పటి పరిస్థితులను అంచనా వేయాలని నిర్ణయించింది.