కులగణనను కూడా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ చివరికి దేశంలో కుల జనగణనను కూడా రాజకీయం చేస్తోందని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా విమర్శించారు. కులగణనకు బిజెపి ఎప్పుడూ అడ్డు చెప్పలేదే. అయితే కాంగ్రెస్‌కు ఈ ప్రక్రియ పట్ల చిత్తశుద్ధి లేదని, దీని ద్వారా సమాజాన్ని విడగొట్టి లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు.  శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో జరిగిన సభలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ  ప్రభుత్వం జ్ఞానులు, గరీబులు, యువజనులు, అన్నదాతలు రైతులు, నారీశక్తి సాధికారికతకు పట్టం కట్టిందని నడ్డా తెలిపారు. ఈ విధంగా అన్ని వర్గాల అభ్యున్నతితోనే దేశం ప్రగతి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ  రాకతో కాంగ్రెస్‌కు దిక్కుతోచని స్థితి ఏర్పడిందని, వారి ఆటలు సాగడం లేదని, ఇంతకు ముందటి రాజకీయాలను మోదీ మార్చివేశారని తెలిపారు. ఇంతకు ముందు రాజకీయాలు కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా చలామణి అయ్యేవి, ఇప్పుడు ఆ పద్థతి మారిందని నడ్డా వివరించారు. 

సామాజిక విభజనలతో కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ముల నడుమ చిచ్చులు పెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు స్వార్థపూరిత రాజకీయాలకు కాలం చెల్లిందని,  కేవలం ప్రగతిదాయక రాజకీయాలకే విలువ పెరిగిందని తెలిపారు. అభివృద్ధి కేంద్రీకృతం అయిన ప్రక్రియలో ప్రజలు తమకు తాముగా ఈ ప్రక్రియలో అంతర్లీనం అవుతున్నారని తెలిపారు. 

ఇంతకు ముందు రాజకీయాలకు గీటురాయి కేవలం ఓటుబ్యాంకులు, ఓ వర్గం మెచ్చుకోలుపై ఆధారపడి ఉండేదని, ఇప్పుడు తీరు మారింది. పనితీరు సంబంధిత రిపోర్టు కార్డు, బాధ్యతల నిర్వహణలో కట్టుబాట్లకు ప్రాధాన్యత ఉందని నడ్డా చెప్పారు. ప్రధాని మోదీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు.  వీటితో దేశంలో దీర్ఘకాలిక సందిగ్థతలకు తెరపడిందని చెప్పారు. 

ఇప్పుడు రాజకీయాలు ఓటు బ్యాంకులు, బుజ్జగింపులపై ఆధారపడి లేవని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, మాజీ సైనికుల సంక్షేమం కోసం ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’  అమలు వంటి సాహసోపేతమైన నిర్ణయాలను మోదీ తీసుకున్నారని తెలిపారు. 

2014కు ముందు భారత్ అంటే అవినీతి అనే అప్రతిష్ట ఉండేదని, కానీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పలు ఘనతలతో ప్రతిష్ట పెరిగిందని ఆయన మోదీ  సర్కారును కొనియాడారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. మోదీ మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక.. దేశ ఆర్థిక వ్యవస్థ 2027 నాటికి మూడో స్థానానికి చేరుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు. 

 ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఆరు రెట్లు, ఔషధాల ఎగుమతులు 138 శాతం, పెట్రోకెమికల్ ఎగుమతులు 108 శాతం పెరిగాయని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో 14 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వ లాడ్లీ బెహనా యోజనతో మహిళలకు సాధికారత కల్పిస్తోందని నడ్డా తెలిపారు. మరోవంక ఇండియా కూటమి అవినీతిపరులను, వారి కుటుంబాలను రక్షించడానికి తాపత్రయపడుతోందని ధ్వజమెత్తారు. 

రాహుల్, ప్రియాంక గాంధీలాగే మాజీ సీఎం కమల్ నాథ్, ఆయన కుమారుడు నకుల్ నాథ్ రాజవంశ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని నడ్డా విమర్శించారు. బీజేపీలో మాత్రమే పేద కుటుంబంలోని వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని, పార్టీ అలాంటి అవకాశాలు నేతలకు కల్పిస్తుందని నడ్డా స్పష్టం చేశారు.