ఎన్నికల వేళ విజయమ్మ అమెరికా ప్రయాణం

ఒకవంక ఎన్నికల సమరం హోరాహోరీగా జరుగుతూ ఉండగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. ఎన్నికలలో మరోసారి గెలుపొంది, అధికారంలోకి రావాలని ఒకవంక కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరోవంక `రాజన్న రాజ్యం’ కోసం కుమార్తె షర్మిల ఎపిసిసి అధ్యక్షురాలి హోదాలో రెండు శిబిరాలుగా విడిపోయి పోరాడుతున్న సమయంలో ఆమె దేశంలో ఉండకుండా వెళ్లారని చెబుతున్నారు.
 
ప్రస్తుతం కుమారుడు వైఎస్ జగన్‌, కుమార్తె షర్మిలలు ప్రత్యర్థులుగా మారిపోవడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో? ఎటు ఉండాలో? తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి వస్తారని ప్రచారం సాగుతోంది. జగన్‌.. ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు మధ్య ‘పొలిటికల్‌ వార్‌’ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది తల్లికి ఇబ్బందిగా మారింది.
 
షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతోనే విజయమ్మకు ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి. మార్చి 27న జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత షర్మిల బస్సుయాత్ర చేపట్టిన సమయంలోనూ ఇడుపులపాయలో కూతురి కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 
 
ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఎదురుకావడంతో ఒత్తిడికి గురైన విజయమ్మ.. మధ్యే మార్గంగా అమెరికాకు వెళ్లినట్టు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.  ఒక వంక కొడుకు పరాజయం కోరుకోలేక, మరోవంక కుమార్తె రాజకీయాలలో విఫలం కావడం తట్టుకోలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
 
గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమె వెంట విజయమ్మ నడిచారు. రాజన్న బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం జగన్ అధికారంలో ఉండగా.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 
 

పైగా, తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రధాన ఎన్నికల అంశంగా చేస్తూ, హంతకులకు సోదరుడు ముఖ్యమంత్రిగా రక్షణ కల్పిస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మరో బాబాయి కుమారుడు పైననే ఆమె పోటీ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ వైఎస్ కుటుంభంలో అనేకమందిని ఇరకాటంలోకి నెట్టివేస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో కుమార్తెకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తే.. కుమారుడికి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కుమారుడికి కన్నతల్లిగా మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేపడితే కుమార్తెకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వైయస్ విజయమ్మ ఓ విధమైన ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కన్నతల్లిగా వైయస్ విజయమ్మ.. కుమారుడు వైయస్ జగన్ వైపా? లేకుంటే కుమార్తె వైయస్ షర్మిల వైపా? అనే సందిగ్దంలోకి ప్రజలు వెళ్లిన సమయంలో ఆమె అనూహ్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు.