నెల్లూరులో పొణకా కనకమ్మ మహిళా యూనివర్సిటీ

*  ప్రధాని మోదీ సానుకూల స్పందన
నెల్లూరులో ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు, తొలి బాలికల పాఠశాల నెలకొల్పేందుకు వందేళ్ల క్రితమే నేడు వేలకోట్ల రూపాయలు విలువచేసే స్థలాలను దానంగా సమకూర్చిన పొణకా కనకమ్మ స్మృత్యర్థం ఓ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఎల్ కె జి నుండి పిజి వరకు మహిళలకు ఉచితంగా విద్యా సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదన పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుముఖంగా స్పందించారు.
 
ఈ విషయమై ఆమె పేరుతో ఓ కేంద్రీయ మహిళా విశ్వవిద్యాలయం నెలకొలపాలని కోరుతూ పొణకా కనకమ్మ ఆశయసాధన కమిటీ కార్యదర్శి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ సెనేట్ సభ్యులు బి సురేంద్రనాథ్ రెడ్డి వ్రాసిన లేఖను ప్రధాన మంత్రి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతూ, ఆయన ప్రతిపాదనను పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై ఓ నివేదిక పంపమని ఆదేశించారు.
 
వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ప్రతిపాదనలను పరిశీలించి, సవివరమైన నివేదిక పంపమని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ ను ఆదేశించారు. కలెక్టర్ తక్షణం స్పందిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఈ బాధ్యతలను అప్పచెప్పారు. సురేంద్రనాథ్ రెడ్డి వ్రాసిన లేఖలో పొణకా కనకమ్మ విరాళంగా ఇచ్చిన స్థలాల విలువ నేడు రూ 2,500 కోట్ల మేరకు ఉంటుందని తెలిపారు. వాటితో ఉచితంగా మహిళా విద్యకోసం విశ్వవిద్యాలయం కృషి చేయవచ్చని సూచించారు.
 
పల్లిపాడు గ్రామంలో ప్రసిద్ధిచెందిన, మహాత్మా గాంధీ స్వయంగా ప్రారంభించిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రయంకు కూడా స్థలం అందించిన దాతగా ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె ప్రముఖ కవయిత్రి, తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన జమీన్ రైతు పత్రిక స్థాపకురాలు కూడా. 1892 జూన్ 10న నెల్లూరు సమీపంలోని పోట్లపూడి గ్రామంలో జన్మించిన ఆమె ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనే జైలుకు వెళ్లడమే కాకుండా తన మొత్తం కుటుంబాన్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేశారు. ఖద్దరు ధరించమని ప్రచారం చేశారు.
ఎనిమిదేళ్ల వయస్సులోనే బావ సుబ్బరామిరెడ్డితో ఆమె వివాహం జరిపించారు. భూస్వామ్య కుటుంభం కావడంతో ఆడపిల్లలను పాఠశాలకు పంపించేందుకు ఆమె కుటుంభం సభ్యులు ఇష్టపడలేదు. అయితే ఆమె సొంతకృషిలో తెలుగుతో పాటు సంస్కృతం, హిందీలలో కూడా ప్రావీణ్యం సంపాదించారు.
16 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు నెల్లూరుకు వందేమాతరం ఉద్యమంలో భాగంగా భార్యతో కలిసి బిపిన్ చంద్ర పాల్ వచ్చినప్పుడు వారికి ఆతిధ్యం ఇచ్చినప్పుడు కలిగిన పరిచయంతో, వారి స్పూర్తితో సుజనా రంజని సమాజం, వివేకానంద గ్రంధాలయం వంటివి ప్రారంభించడం ద్వారా సమాజసేవా కార్యక్రమాలు ప్రారంభించారు. హరిజన ఉద్దరణ కూడా చేపట్టారు. మూడేళ్లపాటు విప్లవ కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె మహాత్మాగాంధీ అనుచరురాలిగా మారిపోయారు.
 
ప్రస్తుతం నెల్లూరు నగరంలో దర్గామిట్ట వద్ద గల శ్రీ కస్తూరిదేవి ఉచిత బాలికల పాఠశాలకు కనకమ్మా విరాళంగా ఇచ్చిన 19.94 ఎకరాల స్థలం విలువ ఇప్పుడు రూ 1,500 కోట్ల మేరకు ఉంటుంది. పల్లిపాడు గ్రహంలో ఆమె సత్యాగ్రహ ఆశ్రయం కోసం ఇచ్చిన 22 ఎకరాల విలువ ఇప్పుడు రూ 900 కోట్ల మేరకు ఉంటుంది.
నెల్లూరు లోని మద్రాస్ బస్టాండ్ వద్ద గల పొనకమ్మ మెమోరియల్ ఎలిమెంటరీ స్కూల్ స్థలం 0.50 ఎకరాల విలువ రూ 9 కోట్ల మేరకు ఉంటుంది.
 
ఇక నెల్లూరు లోని పొణకా కనకమ్మ సదన్, ప్రో. ఎన్ జి రంగా సదన్, జమీన్ రైతు వంటి భవనాల విలువ రూ 5 కోట్ల మేరకు ఉంటుంది. ఈ ఆస్తులతో పాటు వారి కుటుంభం దానంగా సమకూర్చిన ఇతర ఆస్తులను సహితం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కేంద్రీయ మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పి, మహిళలు ఎల్ కె జి నుండి పిజి వరకు ఉచితంగా విద్యసదుపాయం కల్పించాలని సురేంద్రనాథ్ రెడ్డి ప్రధాన మంత్రిని కోరారు.
 
ఈ ప్రతిపాదన పట్ల ప్రధాన మంత్రి మోదీ సానుకూలంగా స్పందించడంతో త్వరలో కార్యరూపం దాల్చగలదని సురేంద్రనాథ్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ విధంగా ఓ కేంద్రీయ విశ్వవిద్యాలయం నెలకొల్పడం కనకమ్మతో పాటు ఆమె భర్త పొణకా సుబ్బరామిరెడ్డి, ఏకైక కుమార్తె మరువురి సుబ్బమ్మల త్యాగాలకు ఓ మహోత్తరమైన స్మరణీకగా మిగిలిపోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ప్రధాన మంత్రికి వ్రాసిన లేఖలో వందేళ్ల క్రితం ప్రజాఉపయోగార్ధం కనకమ్మా విరాళంగా సమకూర్చిన భూములకు సంబంధించిన పాత్రల ప్రతులను సహితం సురేంద్రనాథ్ రెడ్డి పంపారు. ఆయా స్థలంలో ప్రస్తుతం ఎక్కువభాగం ప్రముఖుల దురాక్రమణలో ఉన్నట్లు తెలుస్తున్నది. వాటన్నినీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయగలిగితే నెల్లూరు నగరం ఓ ప్రముఖమైన మహిళా విద్యాకేంద్రంగా దేశంలోనే ప్రఖ్యాతి వహించే అవకాశం ఉంటుంది.