అభద్రతా భావంలో రేవంత్‌ రెడ్డి

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్‌లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అభద్రతా భావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్‌ విమర్శించారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్రకార్యాలయంలో వారికి లక్ష్మణ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కె.లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు.
 
వందరోజుల పాలనను రెఫరెండంగా భావించి ఓటు వేయాలని సీఎం గతంలో అనేక సార్లు చెప్పారని కె.లక్ష్మణ్‌ గుర్తు చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి కాంగ్రెస్‌ మాట మారుస్తున్నదని విమర్శించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే అన్ని గ్యారంటీలు నెరవేరుతాయని చెబుతున్నారని పేర్కొన్నారు. 
 
ఇది బోడి గుండుకు మోకాలికు ముడిపెట్టడమేనని ఎద్దేవా చేశారు. ప్రజల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు తనపై కుట్ర జరుగుతున్నదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌లో తమ అభ్యర్థి మాధవీలత ముచ్చెమటలు పట్టిస్తున్నదని, అందుకే ఓవైసీని గెలిపించడానికి కాంగ్రెస్‌ సిద్ధమైందని ఆరోపించారు. 
 
రేవంత్‌ రెడ్డికి సొంత పార్టీలోనే పొసగడం లేదని, గతంలో మాటల తూటాలు పేల్చే రేవంత్‌ రెడ్డి ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవడం లేదని, అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారమని స్పష్టం చేశారు.