కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫూలు, మత కలహాలు

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే దేశంలో మళ్లీ కుటుంబ పాలన వస్తుందని పేర్కొంటూ పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు దాటినా హామీల అమలు ఊసేలేదని విమర్శించారు.

గురువారం ఆయన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో జీప్ యాత్ర జరుపుతూ మోదీ హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారమైందని వెల్లడించారు. ఎయిర్‌పోర్టులు, వ్యవసాయ రంగం, రైల్వే ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందిందని చెబుతూ కేంద్రంలో బిజెపి మరోసారి గెలవడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. 

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎంపై తీరుపై కిషన్‌రెడ్డి విరుచుకుపడుతూ ఆ మూడు పార్టీల డిఎన్‌ఎ ఒక్కటేనని విమర్శించారు. గత ప్రభుత్వంలో దుశ్శాసన పాత్ర పోషించిన ఎంఐఎం ప్లేట్ పిరాయించి కాంగ్రెస్ పంచన చేరిందని విమర్శలు గుప్పించారు. చీకటి వ్యాపారాలు చేస్తూ, దౌర్జన్యంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పార్టీ ఎంఐఎం అని ఆయన మండిపడ్డారు. 

అసెంబ్లీ ఎన్నికలకి ముందు కెసిఆర్‌ను ఒవైసీ మెచ్చుకున్నారని, ఆ దేశ్ కి నేతను వదిలేసి ప్లేట్ ఫిరాయించాడని ధ్వజమెత్తారు. దౌర్జన్యంగా హిందువుల ఇళ్లను ఖాళీ చేయించిన చరిత్ర ఎంఐఎంది అని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు కుమక్కు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.