తెలంగాణలో రాహుల్‌ ట్యాక్స్‌..!

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజల నుంచి రాహుల్‌గాంధీ (ఆర్‌జీ) ట్యాక్స్‌ వసూలు చేస్తున్నదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల వరకు ఎవరినీ వదలడం లేదని, రూ. వందలకోట్లు వసూలు చేసి ఎన్నికల ఖర్చుల కోసం రాహుల్‌గాంధీకి పంపిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణ ప్రజలను కూడా గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ మోసం చేసిందని విమర్శించారు.

డిసెంబర్‌ 9న రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి హామీకి ఇప్పటికీ దిక్కులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు, రైతుకూలీలు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. తుకుగూడ సభలో పాత గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పని రాహుల్‌గాంధీ కొత్త హామీలు ఇచ్చి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 

జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పండరి, జడ్పీటీసీ రాజురాథోడ్‌ సహా పలువురు నేతలు మంగళవారం బీజేపీలో చేరారు. కిషన్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు అవసరం లేదని, ప్రజా మద్దతుతోనే ఓడిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో పరిపాలనలో, దోపిడీలో మార్పురాలేదని, ప్రజలను వెన్నుపోటు పొడవడంలో మార్పురాలేదని, కేవలం ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే అని పేర్కొంటూ  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏ ఒకటే అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబానికి కొమ్మకాస్తే.. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబానికి కొమ్ముకాస్తోందని చెప్పారు.

గతంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. రాష్ట్రంలోను, దేశంలోను కాంగ్రెస్‌ కచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ ఇటలీకి వెళ్లిపోవడం ఖాయమని పేర్కొన్నారు. 

దేశంలో రైల్వేలు బాగుండాలంటే, సైనిక శక్తి బాగుండాంటే, ఉగ్రదాడులు జరగకుండా ఉండాలంటే, అవినీతి, కుంభకోణాలు జరగకుండా ఉండాలంటే, దేశ భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే 25 ఏండ్లలో అన్ని వర్గాల ప్రజలకు వైద్యం, విద్య అందుబాటులో ఉండేలా, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలిపేలా ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని కిషన్‌రెడ్డి కొనియాడారు.