రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేయడం తమ విధానమని మజ్లిస్ (ఎంఐఎం) మరోసారి నిరూపించుకున్నది. పదేండ్లపాటు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో అనధికార అవగాహన కుదుర్చుకున్నట్టు తెలిసింది.
రెండు, మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేతలకు, ఎంఐఎం అగ్రనేతలకు మధ్య జరిగిన చర్చలు ఫలించినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఈ ఒప్పందం మేరకు హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బలహీనమైన, మైనార్టీయేతర అభ్యర్థిని బరిలోకి దించడానికి కాంగ్రెస్ పెద్దలు అంగీకరించినట్టు ఈ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టిన మూడు ఎంపీ స్థానాల్లో హైదరాబాద్ ఒకటి. తమ పార్టీ ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టడానికి బలమైన కారణాలే ఉన్నప్పటికీ, హైదరాబాద్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి ఇరుపార్టీల మధ్య కొనసాగుతున్న మంతనాలే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ మైనార్టీ నాయకులు షబ్బీర్‌అలీ, అజహరుద్దీన్‌కు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో మొదటి నుంచి పడదు. అయినా, అధిష్ఠానం ఆదేశాల మేరకు వీరిద్దరూ అసదుద్దీన్ వద్దకు వెళ్లి చర్చలు జరపడం ఇరు పార్టీల్లో చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతోపాటు పీసీసీ అధినేత, సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి లేకుండా షబ్బీర్‌అలీ కానీ, అజహరుద్దీన్ కానీ ఒవైసీ వద్దకు వెళ్లి చర్చలు జరిపే అవకాశమే ఉండదని ఈ వర్గాలు చెబుతున్నాయి.
ఇరు పార్టీల మధ్య పరస్పర సహకారం మేరకు కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అవగాహనతో పనిచేస్తామని ఎంఐఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల అనంతరం తొలి అసెంబ్లీ సమావేశంలో ప్రొటెర్మ్ స్పీకర్ గా సంప్రదాయాన్ని పక్కకు నెట్టి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని నియమించినప్పుడే కాంగ్రెస్- ఎంఐఎం దోస్తీకి బీజం పడినట్లు అందరూ భావించారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
మోహన్ బాబు కుటుంభంలో ఆస్తుల విషయమై ఘర్షణ?