ఖజానా నింపుకోవడానికే భూముల ధరల పెంపు

ఖజానా నింపుకోవడానికే భూముల ధరల పెంపు

ఎటువంటి ముందస్తు ప్రణాళిక, శాస్త్రీయత లేకుండా భూముల మార్కెట్ విలువలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను దూరం చేసేలా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, భూయజమానులకు న్యాయబద్ధంగా లబ్ధి చేకూరడాన్ని పార్టీ తరఫున తాము ఎల్లప్పుడూ స్వాగతిస్తామని, కానీ, ప్రస్తుత మార్కెట్ విలువల పెంపు వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం ప్రజలకు మేలు చేసేలా లేదని స్పష్టం చేశారు.

కేవలం రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికే అన్నట్లు ఉందని విమర్శించారు. ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని, ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాలతో మరింత సంక్షోభంలోకి నెడుతోందని ఆయన హెచ్చరించారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా భూముల విలువలను 50 శాతం నుంచి 100 శాతం వరకు, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 శాతానికి పైగా పెంచడం వల్ల సామాన్యుడు భూమి కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా రిజిస్ట్రేషన్ ఫీజుల కోసమే లక్షలాది రూపాయలు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  

గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం కనీస ధరను రూ. 2.75 లక్షలుగా, మున్సిపాలిటీల్లో రూ. 5 లక్షలుగా, హెచ్‌ఎండిఏ పరిధిలో రూ. 10 లక్షలుగా నిర్ణయించి మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని ఆయన దుయ్యబట్టారు. వీటికి తోడు, ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని, పాత ధరల ప్రకారం చలాన్లు కట్టిన వారికి కూడా పెంచిన ధరలనే వర్తింపజేస్తామని చెప్పడం ఈ ప్రభుత్వ నిరంకుశత్వానికి, మొండివైఖరికి పరాకాష్ట అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆరు గ్యారంటీలంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్, గత కొన్ని నెలలుగా వరుసగా చార్జీలు పెంచుతూ సామాన్య ప్రజల నడుం విరగ్గొడుతోందని విమర్శించారు. ఇప్పటికే కరెంట్ బిల్లులను, ఆర్టీసీ బస్సు చార్జీలను, మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్నులను, మంచి నీటి చార్జీలను విపరీతంగా పెంచడంతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో కొత్త లూటీకి తెరలేపిందని రాంచందర్ రావు విమర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన భూముల మార్కెట్ విలువల వల్ల సామాన్యులపై పడే రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని సమీక్షించాలని, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే సామాన్య ప్రజల పక్షాన తరఫున తాము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేపడతామని రాంచందర్ రావు హెచ్చరించారు.