బీఆర్ఎస్ సభకు హాజరైన 106 మంది ప్రభుత్వ సిబ్బందిపై వేటు

బిఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ నుండి పోటీ చేస్తున్న సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి ఏర్పాటు చేసిన సభకు హాజరై, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
మార్చి 7వ తేదీ సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో వెంకట్రామిరెడ్డి సభ ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్న బీజేపీ నాయకులు, వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఈ విషయమై సీఈవో వికాస్ రాజ్ కు ఆధారాలలో సహా ఫిర్యాదు చేశారు.
 
ఈ ఘటనపై విచారణ జరపాలని సిద్దిపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనుచౌదరిని సీఈవో ఆదేశించారు. ఈ సంఘటనపై విచారణ చేసిన కలెక్టర్ 106 మంది ప్రభుత్వ సిబ్బంది ఈ సభలో పాల్గొన్నారని గుర్తించారు.  ఆ 106 మందిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సస్పెండ్ అయిన వారిలో సెర్ప్ ఉద్యోగులు 38 మంది(వారిలో ఏపీఎంలు-14, సీసీలు-18, వీవోఏలు-4, సీఓ-1, సీబీ ఆడిటర్స్-1), ఈజీఎస్ ఉద్యోగులు – 68 మంది (వారిలో ఏపీవోలు-4, ఈసీలు -7, టీఏలు-38, సీఓలు-18, ఎఫ్ఎ-1) ఉన్నారు.
 
కాగా, సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రవికుమార్ గౌడ్‌ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని పండరి నాయక్, ఎల్లయ్య అనే వ్యక్తులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేయగా అది వాస్తవమేనని తెలిసింది. 
 
దీంతో ఆ ప్రొఫెసర్ పై చట్ట ప్రకారం సస్పెన్షన్ వేటు విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉద్యోగులందరూ ఎన్నికల నియమాలకు కట్టుబడి పని చేయాలని ఆదేశించారు.