ఆప్ కు ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా

ఆమ్‌ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పని చేస్తున్న రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. 
 
ఆయన పటేల్‌ నగర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్‌నగర్‌ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 30 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయన నవంబర్ 2022లో ఢిల్లీ కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. లేబర్‌ ఎంప్లాయిమెంట్‌, కో ఆపరేటివ్‌ మంత్రితో పాటు పలు శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.
 
ఈ సందర్భంగా ఆయన పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరానని చెబుతూ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన ఇకపై పార్టీతో కలిసి పని చేయలేనని స్పష్టం చేశారు. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ‘తానాషామీ హటావో.. సంవిధాన్‌ బచావో’ దివస్‌ను పాటించాలని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచి తన సందేశాన్ని పార్టీ నేతలకు సూచించిన కొద్ది గంటల్లోనే ఈ కీలక పరిణామం చోటు చేసుకున్నది.
 
కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తొలి ప్రముఖ నేత ఆయనే కావడం గమనార్హం. ఆప్‌లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తాను దళితుల కోసం పని చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండటం వృథా అని తెలిపారు. ఆప్ కున్న 13 మంది రాజ్యసభ సభ్యులలో ఒకరు కూడా దళిత్, బిసి వర్గాల నుండి లేరని ఆయన విమర్శించారు.
 
మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ రాజీనామాపై ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్ స్పందిస్తూ ఆప్‌ను అంతం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిందని తాము ఇప్పటికే చెప్పామని తెలిపారు. ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తమ మంత్రులను, ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది ఒక పరీక్షలాంటిదని పేర్కొన్నారు. రాజ్ కుమార్ ఆనంద్‌ అవినీతిపరుడు అని పిలిచిన బీజేపీలోనే.. ప్రస్తుతం ఆయన చేరబోతున్నారని సంజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే మరో ఢిల్లీ మంత్రి సురభ్ భరద్వాజ్ పార్టీకి రాజీనామా చేసిన రాజ్ కుమార్ ఆనంద్ ను `ద్రోహి’గా భావించడం లేదని, అరెస్ట్ భయం కావచ్చని చెప్పారు. అందరూ సంజయ్ సింగ్ మాదిరిగా జైలుకు వెళ్లినా ధైర్యంగా ఉండలేరని తెలిపారు. గత ఏడాది ఈడీ ఆయన సంబంధించిన ప్రదేశాలలో సోదాలు జరిపింది. తాజాగా ప్రశ్నించింది.