కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోంది

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోందనీ బిజెపి ఎంపీ ధర్మ పురి అరవింద్ ధ్వజమెత్తారు. `మనది మోదీ కుటుంబం’లో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన చాయిపే చర్చ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ ఆర్మూర్ లోని జీవన్ మాల్ విషయంలో అధికారం వచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ హడావుడి చేసిందని గుర్తు చేసారు. 
 
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,  కాంగ్రెస్ నాయకులు, అధికారులకు కొంచెం చెల్లించగానే మళ్ళీ సపుడు లేదని ఎద్దేవా చేశారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రూ. 50 కోట్లు కట్టాలి, శాఖకు ఒక కిస్తి మాత్రమే కట్టాడు, ఇంకా ఆర్టీసీ, మున్సిపాలిటీకి కట్టాలనీ తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు.
 
తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నిజామాబాద్ సరైన ప్రదేశమని తెలిపారు. మోది రాక ముందు వరి మద్దతు ధర రూ.1300 ఉంటే.. మోది వచ్చాక రూ.2 వేలు దాటిందనీ ఆయన గుర్తు చేశారు. ఎరువులు, యూరియాలు వంటి వాటి మీద రైతులకు రూ. 18వేలు రైతులకు మోదీ ఇస్తున్నాడని తెలిపారు.ప్రతి ఎకరాకు రూ.6వేలు కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్నారని చెబుతూ నిజామాబాద్ జిల్లాకు పసుపు, జగిత్యాల జిల్లా కు మామిడి ని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఎంపిక చేశామని తెలిపారు.ఈ రెండు పంటల ఎగుమతులపై కేంద్రం చర్యలు తీసుకుందని భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే పసుపును ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో మంచి ధర లభించిందని గుర్తు చేశారు. 

పసుపు బోర్డు వస్తే.. విత్తనాలు, భూసార పరీక్షలు మొదలు.. అన్ని అంశాలపై దృష్టి ఉంటుం దని చెప్పారు. పరిమితిలో ఎరువులు వాడితే పసుపు ఎగుమతులకు డిమాండ్ ఉంటుందని రైతులకు సూచించారు. గోదాములు, పసుపు శుద్ది కర్మా గారాలు వస్తాయని పేర్కొన్నారు.  రైతులు, వినియోగదారులను కలిపే వ్యవస్థ ఏర్పాటు అవుతుందని చెబుతూ రైతుల వద్దకే కొను గోలుదారు వచ్చి పంట కొనేలా వ్యవస్థ ఏర్పాటు అవుతుందనీ ఎంపీ తెలిపారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేవలం ఒకే ఒక్క రైల్వే బ్రిడ్జి ఉండేదని, తాను వచ్చాక ఏడు తీసుకొచ్చాననీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  అవినీతి కారణంగానే చక్కెర పరిశ్ర మలు తెరుచుకోవడం లేదనీ మండిపడ్డారు. నిజామాబాద్ మార్కె ట్ యార్డు తెలంగాణా లోనే పెద్దదని చెబుతూ  పసుపు లావాదేవీల మీదనే యార్డు కు రూ 10-12 కోట్లు ఆదాయం వస్తుందని, ఏటా రూ. 20 కోట్ల ఆదాయం ఉంటుందని అరవింద్ వివరించారు.

కానీ ఆ నిధులు నిజామాబాద్ మార్కె ట్ యార్డులో ఖర్చు చేస్తలేరనీ తెలిపారు. కొన్నేళ్లుగా ఆ నిధులు మొత్తం సిరిసిల్ల, సిద్ధిపేటకు వెళ్లిపోయాయని ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఒక్క సౌలత్ ఏర్పాటు చెయ లేదన్నారు. సీఏఏ 2019 లో తెస్తే కాంగ్రెస్ లొల్లి పెట్టిందనీ గుర్తు చేశారు. 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లిం లకు సైతం పౌర సత్వం ఇవ్వాలని ఆందోళన చేశాడని ధ్వజమెత్తారు. ఇప్పుడు సీఏఏ అమలు చేస్తుంటే ఎన్నికలు ఉన్నాయని హిందువుల ఓట్ల కోసం జీవన్ రెడ్డి మౌనంగా ఉన్నాడని చెప్పారు. ముస్లింలకు పౌరసత్వం ఇస్తే ప్రత్యేకంగా ముస్లిం దేశాలు ఎందుకు మరి? అని ప్రశ్నించారు.