కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదు

కెనడా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించలేదని కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారిక కమిషన్ స్పష్టం చేసింది. 2021లో జరిగిన కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీనియర్ కెనడియన్ అధికారులతో కూడిన కమిషన్ దర్యాప్తు జరుపుతోంది. 

కెనడా జాతీయ ఎన్నికలను ప్రభావితం చేయడానికి భారత్ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని కమిషన్ ఎదుట హాజరైన ఒక ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. 2021 ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జోక్యం చేసుకునేందుకు భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని ఆ అధికారి కమిషన్‌కి తెలిపారు. 

అయితే కెనడాలో జరిగిన గత రెండు ఎన్నికలలో చైనా జోక్యం ఉన్నట్లు కెనడా నిఘా సంస్థ గుర్తించినట్లు కమిషన్ ఎదుట ఒక అధికారి వాంగ్మూలం ఇచ్చారు. 2019, 2021 ఎన్నికలలో జోక్యానికి భారత్, పాకిస్తాన్ ప్రయత్నించినట్లు కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సిఎస్‌ఐఎస్) ఆరోపించిన కొద్ది రోజుల్లోనే భారత్ జోక్యం లేదన్న విషయంలో స్పష్టత వచ్చింది.

ఆ రెండు ఎన్నికలలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ విజయం సాధించింది. చైనా ప్రమేయానికి సంబంధించి వచ్చిన వార్తలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్ష ఎంపీలు ఒత్తిడి తీసుకురావడంతో విదేశీ జోక్యం ఆరోపణల నిగ్గు తేల్చడానికి ట్రూడో ఒక విచారణ కమిషన్‌ను నియమించారు.

అయితే, కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ రహస్య పాత్రల నివేదిక ప్రకారం, చైనాతో పాటు కెనడా ప్రజాస్వామ్య ప్రక్రియలకు భారతదేశం ‘సంభావ్య ముప్పు’గా గుర్తించబడిందని గ్లోబల్ న్యూస్ ఫిబ్రవరిలో పేర్కొంది. రెండు బ్యాలెట్లను ప్రభావితం చేయడంలో భారతదేశం ఏ పాత్ర పోషించి ఉండవచ్చనే దానిపై దర్యాప్తు చేయాలనే ఉద్దేశాన్ని ఫెడరల్ కమిషన్ సూచించింది.

అంతకుముందు, నివేదికను నిర్ద్వంద్వంగా తిరస్కరించిన భారతదేశం, విదేశాలలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. వాస్తవానికి ఒట్టావా న్యూఢిల్లీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది.

“మేము మీడియా నివేదికలు, కెనడియన్ కమీషన్ విదేశీ జోక్యాలను విచారించడం చూశాము… కెనడా ఎన్నికలలో భారతదేశం జోక్యంపై ఇటువంటి నిరాధార ఆరోపణలను మేము గట్టిగా తిరస్కరించాము. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం భారత ప్రభుత్వ విధానం కాదు. వాస్తవానికి అందుకు విరుద్ధంగా కెనడా మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది” అని కెనడా మీడియాలో నివేదికలు వచ్చినప్పుడు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆరోపించారు.

న్యూఢిల్లీపై ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్‌- చైనా మధ్య సంబంధాలు చాలా తక్కువ  స్థాయికి చేరుకున్న తరుణంలో తాజా పరిశోధనలు వెలువడడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబరులో, కెనడా ప్రధాని, హౌస్ ఆఫ్ కామన్స్‌లో తన ప్రసంగంలో సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ సంఘటన గత ఏడాది జూన్‌లో జరిగింది. 

అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన జి20 సదస్సు నుండి నిష్క్రమించిన తర్వాత ట్రూడో భారతదేశ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. రెండు దేశాలు సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించాయి. భారతదేశం కొంతకాలం వీసా కార్యకలాపాలను నిలిపివేసింది.

అప్పటి నుండి, ఇరు దేశాల విదేశాంగ మంత్రులు అనేక సందర్భాల్లో సమావేశమయ్యారు. అయితే దౌత్య రంగంలో స్వల్ప పురోగతిని గుర్తించడం జరిగింది.