గాజాలో నెతన్యాహూ తప్పు చేస్తున్నారు

ఇజ్రాయెల్‌- హమాస్‌ నడుమ యుద్ధం మొదలైనప్పటి నుంచి తొలిసారి ఇజ్రాయెల్‌ను అమెరికా తప్పుపట్టింది. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజామిన్‌ నెతన్యాహూ తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 
 
‘నెతన్యాహూ గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించను. ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు తక్షణ కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నా. ఈ విరామ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు’ అని ఓ టీవీ కార్యక్రమంలో బైడెన్‌ వ్యాఖ్యానించారు.

పోయిన వారం గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన డ్రోన్‌ దాడిలో అమెరికాకు చెందిన ఓ ఎన్జీవో సంస్థలో పనిచేసే ఏడుగురు స్వచ్ఛంద సేవకులు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. 

జోర్డాన్‌, సౌదీ, ఈజిప్ట్‌ దేశాలు కూడా నిత్యం సాయం అందించేలా వారితో సంప్రదింపులు జరుపుతున్నామని, వారు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్‌ వ్యవహరించాల్సిన తీరు సరిగా లేదని విమర్శించారు. అయితే గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పారు.

మరోవైపు వైట్‌హౌస్‌ స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్‌ కొన్ని చర్యలు తీసుకుందని, కానీ హమాస్‌ వైపు స్పందన అంత ప్రోత్సాహకరంగా లేదని వ్యాఖ్యానించింది. ఇక ఇజ్రాయెల్‌ ప్రభుత్వం స్పందిస్తూ.. అమెరికా, ఐక్యరాజ్య సమితి డిమాండ్‌ చేసిన విధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని తెలిపింది.

తాము వాటికి ఎలాంటి ఆటంకాలను సృష్టించడం లేదని పేర్కొంది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామాగ్రిని తరలించినట్లు చెప్పింది. యుద్ధం మొదలైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సామాగ్రిని తరలించడం ఇదే తొలిసారని వెల్లడించింది.