ఖలిస్థానీ నినాదాలపై కెనడా రాయబారికి సమన్లు

కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేయడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. దీనిపై భారత్‌లో కెనడా రాయబారికి కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు పంపింది. ఈ విషయాన్ని ఎంఈఏ ఓ ప్రకటనలో తెలియజేసింది. 
 
ఇలాంటి ఘటనల వల్ల వేర్పాటువాదం, ఉగ్రవాదం, హింసకు కెనడా తావిచ్చినట్టు అవుతుందని, దీని ప్రభావం కెనడా- భారత్ సంబంధాలపై పడటమే కాకుండా, సొంత పౌరుల్లో పౌరుల్లో హింస, నేరతత్వా్న్ని కెనడా ప్రోత్సహించడమే అవుతుందని కెనడా రాయబారికి తెలియజేసినట్టు ఎంఈఏ ఆ ప్రకటనలో పేర్కొంది.
 
‘ఖల్సా’ దినోత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు టొరంటోలో ‘ఖల్సా’ పరేడ్ నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని ట్రూడో హాజరయ్యారు. సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి ట్రూడో ప్రసంగించేందుకు వేదికపైకి వెళ్లిన  సమయంలో కొందరు ‘ఖలిస్థానీ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేశారు. అయితే, ట్రూడో మాత్రం వాటిని పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.

దేశంలోని సిక్కుల హక్కులు, స్వేచ్ఛను అన్ని విధాలా పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా సిక్కులు తమ స్వదేశంలోని కుటుంబ సభ్యులను చూసేందుకు వీలుగా భారత్‌, కెనడా మధ్య విమాన రాకపోకలను మరింత పెంచేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ట్రూడో వెల్లడించారు.

కాగా, కొంతకాలంగా భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు క్లిష్టంగా మారాయి. భారత ప్రభుత్వం ఖలిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉందంటూ గత ఏడాది ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాలు మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీనిపై కెనడా దర్యాప్తు చేపట్టగా, ఆ ఆరోపణలను ఢిల్లీ తీవ్రంగా ఖండించింది. 2023 జూన్ 18న నర్రేలోని గురుద్వారా నుంచి నిజ్జర్ బయటకు వస్తుండగా కొందరు వ్యక్తులు అతన్ని కాల్చిచంపారు.