ఉక్రెయిన్‌లో నాలుగు పవర్‌ ప్లాంట్లు ధ్వంసం

* ఉక్రెయిన్‌కు ప్యాట్రియాట్ మిస్సైళ్లు పంప‌నున్న అమెరికా

ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ఏమాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఇటీవల కొంతకాలంగా దాడులకు దూరంగా ఉన్న రష్యా మళ్లీ భారీగా స్థాయిలో దాడులకు దిగుతున్నది. ఉక్రెయిన్‌లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వరుసగా క్షిపణులతో దాడులకు దిగింది.

దీంతో కీలకమైన నాలుగు విద్యుత్ ప్లాంట్లు ధ్వంసమయ్యాయని, దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాపై ఆంక్షలు అమలు చేయాల్సి వచ్చిందని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్‌ దీటుగా రష్యాకు బదులు ఇస్తుండడంతో కొంతకాలంగా ఉక్రెయిన్‌లోని నాలుగు విద్యుత్‌ ప్లాంట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలపై రష్యా దృష్టి పెట్టింది.

ఈ క్రమంలో రష్యా ఉక్రెయిన్‌పై 34 క్షిపణులను ప్రయోగించిందని, అందులో 21 క్షిపణులను మధ్యలోనే కూల్చేశామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మిగతావి తాకడంతో నాలుగు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ధ్వంసమైనట్టు వెల్లడించారు. దాంతో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించామని పీక్ టైంలో ఐరన్ బాక్సులు, వాషింగ్ మెషీన్లు వంటివి వినియోగించవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

 రష్యా దక్షిణ ప్రాంతమైన క్రాన్సోదర్ రీజియన్‌పై దాడులకు దింగింది. 68 డ్రోన్‌లను ప్రయోగించగా.. అందులో 66 డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా డిఫెన్స్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ దాడుల్లో స్లవ్యానస్క్ ప్రాంతంలోని రెండు ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలు ధ్వంసమయ్యాయి. ఒక మిలటరీ ఎయిర్ ఫీల్డ్ సైతం దెబ్బతిన్నది.

ఇలా ఉండగా, అమెరికా త‌న వ‌ద్ద ఉన్న ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిప‌ణుల‌ను ఉక్రెయిన్‌కు స‌ర‌ఫ‌రా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ర‌క్ష‌ణ కార్యాల‌యం పెంట‌గాన్ వెల్ల‌డించింది. కొత్త మిలిట‌రీ ప్యాకేజీ కింద ఆ ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ది. ఉక్రెయిన్‌కు 60 బిలియ‌న్ల డాల‌ర్ల సాయాన్ని అందించేందుకు ఇటీవ‌ల అమెరికా ఉభ‌య‌స‌భ‌లు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. 

దాంట్లో ఆరు బిలియ‌న్ల డాల‌ర్లు ప్యాట్రియాట్ మిస్సైళ్ల కోసం ఖ‌ర్చు చేయ‌నున్నారు. అయితే మిస్సైళ్ల‌ను వ‌దిలేందుకు కావాల్సిన‌ ప్యాట్రియాట్ సిస్ట‌మ్స్‌ను మాత్రం స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌ని ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ర‌ష్యా నుంచి వైమానిక దాడులు ఎక్కువ అవుతున్నాయ‌ని, త‌మ ప్రాణాల‌ను కాపాడుకునేందుకు అర్జెంట్‌గా ప్యాట్రియాట్ మిస్సైళ్లు అవ‌స‌ర‌మ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.