రఫా నగరంపై పదాతిదళంతో దాడికి ఇజ్రాయిల్ సిద్ధం

 
దక్షిణ గాజాలోని రఫా నగరంపై పదాతిదళంతో దాడికి తేదీని ఖరారు చేశామని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజామిన్‌నెతన్యాహు చెప్పారు. ఖాన్‌ యూనిస్‌ నగరం నుండి ఇజ్రాయిల్‌ బలగాలు వైదొలగిన నేపథ్యంలో నెతన్యాహు ప్రకటన వెలువడింది. రఫా నగరంలో దాదాపు 14 లక్షల మంది నిర్వాసితులైన ప్రజలు తలదాచుకున్నారు.
 
రాఫాపై దాడికి సిద్ధమవడం కోసమే తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రక్షణ అధికారులు తెలిపారు.  హమాస్‌పై యుద్ధంపై తగ్గేదే లేదంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తెగేసి చెప్పా రు. దక్షిణ గాజానగరం రఫా సహా అన్ని చోట్ల హమాస్‌ బ్రిగేడ్లను పూర్తిగా తుడిచిపెట్టే వరకు తమనెవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
 
రఫాపై దాడులు చేస్తే ఏకాకిగా మిగిలే ప్రమాదముందని అమెరికా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో నెతన్యాహు మాట్లాడుతూ ‘ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు. ఎన్నో శక్తు లు మా చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. కానీ ప్రయోజనం లేదు. మా శత్రువు ఇటీవల చేసింది భవిష్యత్‌లో మళ్లీ చేయకుండా గట్టిగా బుద్ధి చెబుతాం’ అని ఆయన పేర్కొన్నారు.
 
దీనిపై హమాస్‌ ప్రతినిధి సమీ అబూ జహ్రీ స్పందిస్తూ కైరోలో కాల్పుల విరమణ కోరుతూ చర్చలను పునరుద్ధరించడంపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈజిప్ట్‌లో మధ్యవర్తులు అందజేసిన తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనపై సమీక్షిస్తున్నామని తొలుత హమాస్‌ తెలిపింది. గాజా నగరంలోని జీటూన్‌ ప్రాంతంలో గత 24గంటల్లో ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు బాంబు దాడులకు దిగడంతో 153మంది చనిపోయారు. 
 
తాజా పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ స్పందిస్తూ కాల్పుల విరమణపై హమాస్‌కు ఒక ప్రతిపాదన అందజేశామని, ప్రస్తుతం హమాస్‌ కోర్టులో బంతి వుందని, ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి వుందని వ్యాఖ్యానించారు. గాజాలో నెలకొన్న సంక్షోభానికి మరింత ఆజ్యం పోసేలా తప్పుడు ప్రచారం జరుగుతోందని, అందువల్ల అక్కడ పరిస్థితులు తెలుసుకునేందుకు వీలుగా అంతర్జాతీయ జర్నలిస్టులను అక్కడకు పంపించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.