ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఆప్‌ ఎమ్యెల్యే

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌- ఈడీ మెరుపు వేగంతో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆప్‌ నేతలకు వరుసగా సమన్లు జారీ చేస్తోంది. తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే దుర్గేష్‌ పాఠక్‌కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు ఇచ్చారు.
 
సోమవారమే తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొనగా  ఆయన మధ్యాహ్నం ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దుర్గేష్ పాఠక్‌తోపాటు కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను కూడా ఈడీ అధికారులు సోమవారం వేర్వేరుగా విచారణ జరిపారు.  2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నగదు చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌ పేరు ప్రస్తావనలోకి వచ్చింది.
 
దీంతో దుర్గేష్ పాఠక్‌కు సమన్లు జారీ చేయగా ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లగా, ఆయన పీఏ బిభవ్‌ కుమార్‌ను కూడా ఈడీ అధికారులు సోమవారం ఉదయం ఈడీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం బిభవ్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
 
ఇక ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి  మనీష్ సిసోడియా, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వివిధ కేసుల్లో అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించింది. ఇటీవలే ఎంపీ సంజయ్‌ సింగ్‌ బెయిల్‌పై బయటకు వచ్చారు. 
 
ఇక కొన్ని రోజుల ముందే ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లోత్‌కు సమన్లు జారీ చేయగా  ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని రాజిందర్ నగర్ నియోజకవర్గం నుంచి దుర్గేష్ పాఠక్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అవిర్భావం నుంచి ఉన్నారు. ఇక 2022 గోవా ఎన్నికల్లో ఆప్ ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరించారు.